ధర్మ దర్శనానికి 3గంటలకుపైగా సమయం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. క్రిస్మస్ సెలవు రోజు కావడంతో ఉదయం 11గంటల తరువాత భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కొండ కింద రింగ్ రోడ్డులో నుంచి మూడవ ఘాట్ రోడ్డు మార్గమంతా నిండిపోయింది. కొండపైన ఆలయ పరిసరాలు, ముఖమండపం, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు వంటి ప్రాంతాల్లో భక్తులు నిండిపోయారు.
బ్రేక్ దర్శనం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. బ్రేక్ దర్శనం కొనసాగుతున్న సమయంలో ధర్మ దర్శనం, రూ.150 టికెట్ దర్శనం లైన్లు నిండిపోయాయి. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకుపైగా, వీఐపీ, బ్రేక్ దర్శనానికి ఒక గంట సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 60 వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ విభాగాల ద్వారా నిత్యాదాయం రూ.68,97,437 వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.


