ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూనే అక్రమంగా సంక్షేమ పథకాల ఫలాలు
అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నట్టు తేల్చిన ఆధార్ లింకేజీ
ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్ల సోషల్ ఆడిట్ వివరాలు, ఉద్యోగుల ఆధార్‌తో సరిపోలిన వైనం
నాలుగు పథకాల్లోనే ఇలా 37 వేల మంది పథకాలు అందుకున్నట్లు వెలుగులోకి..
జాబితాలో లెక్చరర్లు, అర్చకులు, వీఆర్వో, వీఆర్‌ఏలు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు
చేయూత పథకంలోనే 15 వేల మందికి పైగా లబ్ధిదారులు
పలు పథకాల్లో లక్షల సంఖ్యలో లబ్ధి పొందుతున్నట్లు అంచనా...
ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక
ఆదాయ పరిమితికి లోబడి పథకాలు పొందిన వారి విషయంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
అన్ని పథకాలపై ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అనర్హులకు చేరుతున్నాయా? వేల సంఖ్యలో సంపన్నులు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా? అందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల వెల్లడైన నివేదికలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం సేకరించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ వివరాలు.. ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల లబ్ధిదారుల వివరాలతో సరిపోలినట్లు తేలింది. 800 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమ పథకాలను కూడా తీసుకుంటున్నారని నామమాత్రపు సర్వేలో వెల్లడైన నేపథ్యంలో అన్ని సంక్షేమ పథకాలపై నిశిత పరిశీలన జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సామాజిక పింఛన్లతోపాటు ఇతర అన్ని సంక్షేమ పథకాలపై ఆడిట్ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
నాలుగు చోట్ల.. నిశిత ఆడిట్
వివిధ వర్గాల పేదలు, నిర్దేశిత కేటగిరీలకు చెందిన నిజమైన లబ్ధిదారులకు దక్కాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు పలువురు ప్రభుత్వ అధికారులు మొదలు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఇంటికి చేరుతున్నాయి. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి జీతాలు, అలవెన్స్‌లు పొందుతున్న 478 మంది రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు పొందుతున్న 338 మంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్టు తాజాగా గుర్తించారు.
ఈవిధంగా పలు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్న వారిలో అధిక మొత్తాల్లో వేతనాలు, అలవెన్స్‌లు పొందుతున్న అధికారులు, ఉద్యోగులతోపాటు లగ్జరీ కార్లు, మూడంతస్తుల భవనాలు, పెట్రోల్ బంక్‌ల యజమానులు కూడా ఉండటం ఆశ్చర్యం గొలుపుతోంది. అదికూడా కేవలం కరీంనగర్, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్లు, ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వపరంగా నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’లోనే ఇంతమంది అనర్హులు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్నట్టు తేలింది.
మరింత లోతుగా పరిశీలన చేస్తే...
ప్రధానంగా సామాజిక పెన్షన్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అవకతవకలు మచ్చుకు కొన్ని బయటపడ్డాయి. మొత్తంగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డేటాను వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటాతో లింక్ చేసి ఆధార్ సమాచారాన్ని ‘క్రాస్ వెరిఫై’ చేసినప్పుడు... 37 వేల మందికిపైగా ఉద్యోగులు (రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతరులు కలిపి) ప్రయోజనం పొందుతున్నట్టుగా వెల్లడైంది.
ప్రభుత్వ ఉద్యోగుల (కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సహా) ఆధార్ వివరాలను వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాబేస్‌తో సరిచూసినప్పుడు ఈ ఉద్యోగుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’ కేవలం ఉపరితలాన్ని మాత్రం స్పృశించినట్టుగా కొంత సమాచారం మాత్రమే బయటకు వచ్చిందని, మరింత లోతుగా పరిశీలన జరిపితే ఇతర పథకాల ద్వారా కూడా పలువురు ఉద్యోగులు ప్రయోజనాలు పొందే విషయం వెలికితీసే అవకాశం ఉందని అంటున్నారు.
అక్రమంగా ‘చేయూత’
ఆధార్ కార్డుల పరిశీలన అనంతరం చేయూత పథకం సామాజిక పింఛన్ లబ్ధి పొందుతున్న ఉద్యోగుల వివరాలను కేటగిరీల వారీగా ప్రభుత్వానికి పంపారు. ఈ పథకంలో అంగన్ వాడీ హెల్పర్లు (1521), టీచర్లు (487), ఏఎన్‌ఎం (100), అర్చకులు (178), ఆర్టిజన్ (167), ఆశావర్కర్లు (1,280), కుక్‌లు (3,667), ఆయాలు (33), కండక్టర్లు (42), కాంట్రాక్టు టీచర్లు (35), డాటా ఎంట్రీ ఆపరేటర్లు (98), డ్రైవర్లు (68), ఫీల్డ్ అసిస్టెంట్లు (84), హోంగార్డులు (110), జూనియర్ లెక్చరర్లు (30), కామాటి (61), మౌజాం, ఇమాంలు (514), మల్టీపర్పస్ వర్కర్లు (2,263), అటెండర్లు (289), పబ్లిక్ హెల్త్ మేనేజర్లు (629), శానిటరీ సిబ్బంది (1145), పీజీటీలు (47), ఎస్‌జీటీ, టీజీటీలు (71), సెక్యూరిటీ గార్డులు (119), స్వీపర్లు (288), వీవోఏ (645), వీఆర్‌ఏ (164), వాచ్‌మెన్ (90) మంది కూడా ఉన్నారు. అలాగే, చాలా తక్కువ సంఖ్యలో వొకేషనల్ టీచర్లు, స్టాఫ్ నర్సులు, స్పెషల్‌పోలీస్ అధికారులు, స్పెషల్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ (సెకండ్ క్లాస్), లెక్చరర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఆరోగ్య మిత్రలు కూడా ఉన్నారని వెల్లడైంది.
వీరిలో ఎవరికి ఇవ్వాలి?
ఇలా పథకాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది ఆదాయ పరిమితికి లోబడి సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపికైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా పథకాలను పొందేందుకు అవసరమైన మేరకు వారి వేతనం లేని కారణంగా వీరు లబ్ధి పొందేందుకు అర్హులేననే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, దినసరి కార్మికులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, అర్చకులు, ఆర్జిజన్లు, కుక్‌లు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, మౌజం, ఇమాంలు, వీఏవో, వీఆర్‌వోలు, ఎస్‌పీవోలు, పార్ట్‌టైం ఉద్యోగుల విషయంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరింది.
గ్రాంట్‌ఇన్ ఎయిడ్ రెగ్యులర్, మినిమమ్ టైమ్ స్కేల్, రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, టైంస్కేల్ పొందుతున్న ఇతర కేటగిరీల ఉద్యోగులకు మాత్రం ఆయా పథకాలను వెంటనే నిలిపివేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసరా పింఛన్లపై సోషల్ ఆడిట్ నిర్వహణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించగా, మిగిలిన సంక్షేమ పథకాలపైనా ఆడిట్ నిర్వహించే దిశలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ వివిధ పథకాలు పొందుతున్న వారు.. 


ఉల్లంఘనలు ఇలా...
⇒ నెలకు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్న అధికారులు, ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు చేయూత పింఛన్లు పొందుతున్నారు.
⇒ కార్లు, ట్రాక్టర్లు, సొంతిళ్లు ఉన్నవారూ ప్రయోజనాలు అందుకుంటున్నారు.
⇒ డిజేబిలిటీ పింఛన్లు... వైకల్యం లేకపోయినా కొందరికి అందుతున్నాయి.
⇒ 50 ఏళ్లు దాటని వారు కూడా వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు.


