ఆర్థికంగా అత్యవసరం తలెత్తినప్పుడు బంగారం ఉంటే అక్కరకువస్తుంది. బ్యాంకులు, ఇతర సంస్థల్లో తాకట్టు పెట్టి లోన్ పొందవచ్చు. ఈ కారణంతోనే చాలామంది మధ్య తరగతి వాళ్లు కూడా తమ స్తోమతకు మించి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే మరి పేద, సామాన్య ప్రజల దగ్గర బంగారు ఆభరణాలు, వస్తువులు ఉండవు. ఏదో కొద్దో గొప్పో వెండి ఆభరణాలు, వస్తువులు ఉంటే ఉంటాయి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాటిపై లోన్లు ఎవరూ ఇవ్వరు కదా.. అని ఇన్నాళ్లు బాధపడిఉంటారు. ఇకపై ఆ బాధ అక్కర్లేదు. పేదల బంగారంగా భావించే వెండిపైనా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇవ్వనున్నాయి.
వెండిపై రుణాలకు సంబంధించి వాణిజ్య బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు రుణ మార్గదర్శకాలను ఆర్బీఐ సవరించింది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుండి వెండి ఆభరణాలు, వస్తువులు లేదా నాణేలను తాకట్టు పెట్టి రుణాలను పొందవచ్చు. పేదలు, సామాన్యులకు రుణ లభ్యతను మెరుగుపరచడానికి ఆర్బీఐ ఈ మార్పులు చేస్తోంది. అయితే ప్రాథమిక వెండి అంటే ఆభరణాలు, వినియోగ వస్తువులు కాకుండా వాణిజ్యానికి ఉపయోగించే వెండి బార్లపై మాత్రం ఈ రుణ సదుపాయం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అయితే బంగారంపై ఇచ్చినట్లుగా దాటి రేటు ఆధారంగా అధిక మొత్తంలో రుణాలు వెండిపై ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. వెండికి ఉన్న అధిక అస్థిరత, తక్కువ లిక్విడిటీ కారణంగా లోన్-టు-వాల్యూ నిష్పత్తులు, వడ్డీ రేట్లకు సంబంధించి వెండిపై రుణాలు బంగారు రుణాలతో పోల్చితే భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల బ్యాంకులు, రుణ సంస్థలు వెండి-ఆధారిత రుణాలపై తక్కువ క్రెడిట్ పరిమితులను, కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చు. తాకట్టు పెట్టిన వెండి స్వచ్ఛత, నిల్వ, బీమా ఖర్చులు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, జప్తు నిబంధనలతో సహా కారకాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని రుణగ్రహీతలకు ఆర్బీఐ సూచించింది.


