కేంద్ర ప్రభుత్వం తాజాగా బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం (Gold) దిగుమతి ధర 10 గ్రాములకు 42 డాలర్లకు తగ్గింది. అలాగే వెండి (Silver) దిగుమతి ధర కిలోకు 107 డాలర్లకు తగ్గింది. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా తీసుకున్నది. దీని ఉద్దేశం దేశీయ మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం.
బేస్ ఇంపోర్ట్ ధర అంటే..
బేస్ ఇంపోర్ట్ ప్రైస్ (Base Import Price) అనేది ప్రభుత్వం నిర్ణయించే సూచిక ధర. ఇది కస్టమ్స్ సుంకాలు (Import Duty) లెక్కించడానికి ఉపయోగిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వం ఈ ధరను అప్‌డేట్ చేస్తుంది. బేస్ ధర తగ్గితే దిగుమతిదారులపై పన్ను భారం తగ్గుతుంది. అందువల్ల మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా స్థిరంగా లేదా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
బంగారం దిగుమతుల్లో భారత్ స్థానం
చైనా ప్రపంచంలో అతిపెద్ద బంగారం దిగుమతిదారు. భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ప్రజలు ఆభరణాలు, పెట్టుబడుల కోసం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. బేస్ ధర తగ్గడం వల్ల బంగారం దిగుమతి ఖర్చు తగ్గి వినియోగదారులకు లాభం కలగవచ్చు. వెండి విషయంలో , భారత్ ప్రపంచంలోనే అత్యధిక దిగుమతిదారు.
పసిడి దిగుమతులు ఇక్కడి నుంచే..
పలు నివేదికల ప్రకారం.. భారత్ తన బంగారంలో ఎక్కువ భాగం స్విట్జర్లాండ్ నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇది దాని దిగుమతుల్లో 40 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత అధికంగా పసిడి దిగుమతి చేసుకునేది యూఏఈ నుంచి. ఇది మొత్తం దిగుమతుల్లో 16 శాతం. ఇక దక్షిణాఫ్రికా సుమారు 10 శాతంతో మూడవ స్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 48 దేశాల నుండి పసిడి లోహాన్ని దిగుమతి చేసుకుంది. 2024-25లో బంగారం దిగుమతులు 27.3 శాతం పెరిగి 58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ప్రస్తుత బంగారం, వెండి ధరలు
భారత్‌లో ప్రస్తుతం (నవంబర్ 2న) బంగారం, వెండి ధరలు (Gold and Silver Price) ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,23,150 వద్ద, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,12,900 వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.1,52,000 వద్ద ఉంది.
👉 ఇది చదవలేదా ఇంకా? అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!


