జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్) సభ్యులకు హార్షానిచ్చే మార్పులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) శ్రీకారం చుట్టింది. పదవీ విరమణ నాటికి సమకూరిన మొత్తం నిధిలో 60 శాతం ఉపసంహరణకు ప్రస్తుతం అనుమతి ఉండగా, ఇకపై 80 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 20 శాతంతో యాన్యూటీ ప్లాన్ (క్రమానుగతంగా పింఛను చెల్లించే) కొనుగోలు చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం గరిష్టంగా 70 ఏళ్ల వయసు వరకే ఎన్‌పీఎస్‌లో కొనసాగేందుకు అనుమతి ఉంది. దీన్ని ఇప్పుడు 85 ఏళ్లకు పెంచారు. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రకటించింది. గెజిట్ ప్రకటించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది.
పథకం నుంచి వైదొలిగే నాటికి పింఛను నిధి రూ.8లక్షల్లోపు ఉంటే ఆ మొత్తాన్ని సభ్యులు ఒకే విడత, లేక సిస్టమ్యాటిక్ యూనిట్ రిడెంప్షన్ రూపంలో (క్రమానుగతంగా/ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ మాదిరి) వెనక్కి తీసుకోవచ్చు.
నాలుగేళ్ల విరామంతో సభ్యులు ఇకపై నాలుగు పర్యాయాలు పాక్షిక ఉపసంహరణ చేసు కోవచ్చు. ప్రస్తుతం 3 సార్లకు అనుమతి ఉంది.
60 ఏళ్ల రిటైర్మెంట్ వయసు తర్వాత కొనసాగే వారు మూడేళ్ల విరామంతో మూడు పాక్షిక ఉపసంహరణలే చేసుకోగలరు.
ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వ చందాదారులు సైతం 85 ఏళ్ల వరకు కొనసాగొచ్చు. అంటే 85 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడులను సైతం కొనసాగించుకోవచ్చు. వీరు పథకం నుంచి వైదొలిగే సమయంలో కనీసం 40 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతాన్ని ఒకే విడత లేదా క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు.
రాజీనామా లేక తొలగింపు కారణంగా పథకం నుంచి మందుగా వైదొలిగే ప్రభుత్వ చందాదారులు.. పింఛను నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యూటీ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి.
పింఛను నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే.. సాధారణ వైదొలగడం, ముందస్తుగా వైదొలగడం లేదా సభ్యుడు మరణించిన సందర్భాల్లో పూర్తి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.


