పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్‌పర్సన్ రామన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా 25–40 ఏళ్ల వయస్సు వారు పెన్షన్ అనే మాట వినడానికి పెద్దగా ఇష్టపడకపోయినప్పటికీ, పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా ఎంతగానో ఉపయోగకరంగా ఉండే దీని ప్రాధాన్యత గురించి యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్‌పర్సన్ ఎస్.రామన్ తెలిపారు. ప్రస్తుతం 55 కోట్ల మంది పైగా వర్క్‌ఫోర్స్ ఉండగా, కేవలం 10 కోట్ల మందే సంఘటిత రంగంలో ఉన్నారని శుక్రవారమిక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
మిగతా 30–40 కోట్ల మంది అసంఘటిత రంగంలోనే ఉంటున్నారని, వారందరినీ కూడా పెన్షన్ ఫండ్ పరిధిలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొందని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్లు గణనీయంగా రాబడులు అందిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక భద్రతకు అధిక రాబడుల కోసం పోంజీ స్కీముల్లాంటి వాటి వలలో పడకుండా సురక్షితమైన పెన్షన్ ఫండ్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరమని వివరించారు. మరోవైపు గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రతను కల్పించే విధంగా చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.


