ప్రపంచ పెట్టుబడి రంగంలో ఒక శకం ముగియబోతోంది. లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నుంచి బెర్క్‌షైర్ హాత్వే బాధ్యతలను గ్రెగ్ అబెల్ ఈ వారం చివరలో అధికారికంగా చేపట్టనున్నారు. 1962లో కేవలం ఒక చిన్న టెక్స్‌టైల్ మిల్లుగా ప్రారంభమైన బెర్క్‌షైర్‌ను నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు బఫెట్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో బఫెట్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అబెల్ ముందున్న అతిపెద్ద సవాలు.
అసాధారణ ప్రస్థానం: బఫెట్ వారసత్వం
గత ఆరు దశాబ్దాల్లో బఫెట్ బెర్క్‌షైర్‌ను ఒక సామ్రాజ్యంగా మార్చారు. గీకో (Geico), నేషనల్ ఇండెమ్నిటీ వంటి బీమా సంస్థలు, డెయిరీ క్వీన్, బీఎన్‌ఎస్‌ఎఫ్(BNSF) రైల్ రోడ్ వంటి దిగ్గజ కంపెనీలను కొనుగోలు చేశారు. యాపిల్, కోకాకోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థల్లో వారెన్ బఫెట్ చేసిన దీర్ఘకాలిక పెట్టుబడులు అపారమైన లాభాలను తెచ్చిపెట్టాయి. గత 20 ఏళ్లలో 60 బిలియన్ డాలర్లకు పైగా దానం చేసినప్పటికీ, బఫెట్ వ్యక్తిగత సంపద నేడు సుమారు 150 బిలియన్ డాలర్లుగా ఉంది.
గ్రెగ్ అబెల్.. కొత్త నాయకత్వం
2018 నుంచి బెర్క్‌షైర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న 62 ఏళ్ల గ్రెగ్ అబెల్, బఫెట్ కంటే భిన్నమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అబెల్ ఇటీవల నెట్ జెట్స్ సీఈఓ ఆడమ్ జాన్సన్‌ను కంపెనీ సర్వీస్, రిటైల్ విభాగాలకు హెడ్‌గా నియమిస్తూ సంస్థలో మూడో విభాగాన్ని సృష్టించారు. టాడ్ కాంబ్స్ (గీకో సీఈఓ) నిష్క్రమణ, సీఎఫ్ఓ మార్క్ హాంబర్గ్ పదవీ విరమణ నేపథ్యంలో అబెల్ కంపెనీలో కీలకంగా మారారు. సంస్థలో నాయకత్వ మార్పులు ఉన్నప్పటికీ బెర్క్‌షైర్ ప్రధాన సూత్రమైన ‘వికేంద్రీకరణ’ (Decentralization) మారదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముందున్న సవాళ్లు
బెర్క్‌షైర్ ప్రస్తుతం 382 బిలియన్ డాలర్ల భారీ నగదు నిల్వ కలిగి ఉంది. ఇంత భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సరైన అవకాశాలు దొరకకపోవడం అబెల్ ముందున్న ప్రధాన సమస్య అని కొందరు చెబుతున్నారు. ఒకవేళ కొత్త కొనుగోళ్లు చేయలేకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాటాదారులకు డివిడెండ్లు చెల్లించాలని లేదా స్టాక్ బైబ్యాక్ చేయాలని పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అయితే, బఫెట్ వద్ద ఉన్న 30 శాతం ఓటింగ్ పవర్ కారణంగా అబెల్‌కు ప్రస్తుతం ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చు. బఫెట్ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగుతూ, రోజూ కార్యాలయానికి వస్తూ సలహాలు ఇస్తానని ప్రకటించడం వాటాదారులకు ఊరటనిచ్చే అంశం.
ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?


