లాభాలు పెరిగినప్పటికీ, మార్కెట్లపై అప్రమత్త ధోరణిని చూపిస్తూ బెర్క్‌షైర్ (Berkshire) హాతవే సంస్థ రికార్డు స్థాయి నగదు నిల్వలను ప్రకటించింది. కంపెనీ నగదు నిల్వలు మూడవ త్రైమాసికంలో 381.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది బెర్క్‌షైర్ చరిత్రలో అత్యధికం.
వారెన్ బఫెట్ (Warren Buffett) సీఈఓ హోదాలో తన చివరి త్రైమాసిక నివేదికను విడుదల చేసిన సందర్భంలో ఈ ప్రకటన వచ్చింది. 95 ఏళ్ల బఫెట్ ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్నారు.
స్టాక్ విక్రయాలు, బైబ్యాక్ నిలిపివేత
బెర్క్‌షైర్ వరుసగా 12వ త్రైమాసికంలో కొనుగోలు కంటే ఎక్కువ స్టాక్స్‌ను విక్రయించింది. దాని 283.2 బిలియన్ డాలర్ల ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో యాపిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి హోల్డింగ్స్ ఉన్నాయి. కంపెనీ ఐదవ వరుస త్రైమాసికంగా తన సొంత స్టాక్ బైబ్యాక్‌ను నిలిపివేసింది. అయినప్పటికీ దాని షేర్ ధర విస్తృత మార్కెట్‌ను మించకపోవడం గమనార్హం.
లాభాల్లో పెరుగుదల, కానీ వృద్ధి మందగింపు
తక్కువ బీమా నష్టాలు మూడవ త్రైమాసిక ఆపరేటింగ్ లాభాన్ని 34% పెంచి 13.49 బిలియన్ డాలర్లకు చేర్చాయి. ఇది విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. నికర లాభం 17% పెరిగి 30.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే మొత్తం ఆదాయం కేవలం 2% మాత్రమే పెరిగింది. ఇది అమెరికా ఆర్థిక వృద్ధి రేటుకంటే తక్కువ.
కంపెనీ ప్రకారం.. ఆర్థిక అనిశ్చితి, వినియోగదారుల విశ్వాసం తగ్గడం ప్రధాన అవాంతరాలుగా మారాయి. ఈ ప్రభావం క్లేటన్ హోమ్స్, డ్యూరాసెల్, ఫ్రూట్ ఆఫ్ ది లూమ్, స్క్విష్‌మాలోస్ తయారీదారు జాజ్వేర్స్ వంటి అనుబంధ వ్యాపారాలపై కనిపించింది.
నాయకత్వ మార్పు దిశగా..
వారెన్ బఫెట్ వైదొలుగుతున్న తరుణంలో, 63 ఏళ్ల గ్రెగ్ అబెల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బఫెట్ మాత్రం చైర్మన్‌గా కొనసాగుతారు. కాగా అబెల్.. బఫెట్ కంటే కూడా “మరింత హ్యాండ్-ఆన్” మేనేజర్‌గా ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో బెర్క్‌షైర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.
👉 ఇది ఇంకా చదవలేదా? అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!


