నాణ్యతతో చౌక ధరలకే సరఫరా
వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్
భారత్ అంతర్జాతీయంగా నాణ్యమైన ఔషధాలను చౌక ధరలకే అందిస్తున్న విశ్వసనీయ భాగస్వామి అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మాస్యూటికల్ ఎగుమతులు 10 శాతం వృద్ధితో 30.47 బిలియన్ డాలర్లకు చేరినట్టు చెప్పారు.
చండీగఢ్‌లో ఫార్మా ఎగుమతులపై జరిగిన చర్చా కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లడారు. ఔషధాల ఉత్పత్తిలో (పరిణామం పరంగా) భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా ఉందని, విలువ పరంగా 14వ స్థానంలో ఉందన్నారు. భారత ఔషధాలు 200కు పైగా దేశాలకు వెళుతున్నట్టు తెలిపారు. ఇందులో అమెరికాకు 34 శాతం, యూరప్‌కు 19 శాతం ఎగుమతి అవుతున్నట్టు చెప్పారు. 3,000కు పైగా కంపెనీలు, 10,500కు పైగా తయారీ యూనిట్లతో కార్యకలాపాలు నిర్వరహిస్తున్నట్టు వెల్లడించారు.
సుంకాలేతర అవరోధాల పరిష్కారం, నియంత్రణపరమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, పటిష్టమైన లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల ఎకోసిస్టమ్ ఏర్పాటుపై దృష్టి సారించినట్టు చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్ పరిమాణం 60 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2030 నాటికి రెట్టింపై 130 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.


