కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) గణనీయంగా ప్రయోజనం పొందేందుకు ఆస్కారం ఉంది. దీనితో వాటికి 500 బిలియన్ డాలర్లకు పైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీఎక్స్), భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 6.4 కోట్ల ఎంఎస్‌ఎంఈల ముంగిట అపార అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.
నివేదికలో మరిన్ని అంశాలు..
కృత్రిమ మేథ వినియోగానికి సంబంధించి టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటున్నప్పటికీ, గ్లోబల్ ఏఐ పేటెంట్లలో వాటా మాత్రం 1 శాతం కన్నా తక్కువే ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న సవాళ్ల పరిష్కారం కోసం ఏఐ ఆధారిత వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.
ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ప్రాంతీయ వ్యవస్థలవ్యాప్తంగా ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ ఉత్పాదకతపరమైన ప్రయోజనాలు పొందడం, నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా సామాజిక–ఆర్థిక పటిష్టతను సాధించవచ్చు.
ఏఐపై ఆసక్తి, పెట్టుబడులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దాదాపు 44 శాతం ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికీ తమ టెక్నాలజీ బడ్జెట్‌లో ఏఐకి కేటాయిస్తున్నది 10% లోపే ఉంటోంది.
ప్రధానంగా ఏఐ ఆధారిత వ్యాపారాలను నిర్మించడం, మరిన్ని ఆవిష్కరణలు చేయడం, వాటిని అందరికీ అందుబాటులోకి తేవడంలాంటి చర్యలతో కృత్రిమ మేథ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవచ్చు.
2026లో నిర్వహణ విధానాల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిర్దిష్ట విధుల నిర్వహణకు, ముందుగా ఏఐని వినియోగించుకోవడం పెరుగుతుంది.
ఇదీ చదవండి: రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ


