కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఏఎల్) మాజీ ఉద్యోగులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.312 కోట్ల వేతన బకాయిలను కంపెనీ మాజీ ఉద్యోగులకు చెల్లించినట్లు అధికారికంగా ప్రకటించింది. చెన్నైలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని అధికారిక లిక్విడేటర్‌కు ఈడీ బదిలీ చేసింది.
గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి ఈడీ అప్పగించిన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. సెక్యూర్డ్ క్రెడిటర్ల (బ్యాంకుల) క్లెయిమ్‌ల కంటే కార్మికుల బకాయిలకే ప్రాధాన్యత ఇవ్వడానికి ఎస్‌బీఐ అంగీకరించింది.
మనీలాండరింగ్ కేసు నేపథ్యం
వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేయడంతో 2016లో విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయారు. దీనిపై విచారణ చేపట్టిన ఈడీ, మాల్యాను జనవరి 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఇప్పటివరకు మాల్యా, కింగ్‌ఫిషర్ సంస్థలకు చెందిన దాదాపు రూ.5,042 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి జప్తు చేసింది. అదనంగా రూ.1,695 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
రికవరీలో..
ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో జప్తు చేసిన ఆస్తులను ఈడీ బ్యాంకుల కన్సార్టియానికి అప్పగించింది. వీటి విక్రయం ద్వారా బ్యాంకులు ఇప్పటివరకు దాదాపు రూ.14,132 కోట్లు వసూలు చేసుకున్నాయి. ‘దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల బకాయిలను పరిష్కరించడానికి మేము వాటాదారులతో సమన్వయం చేసుకున్నాం. ఎస్‌బీఐ అధికారులతో చర్చించి పునరుద్ధరించిన ఆస్తుల ద్వారా ఉద్యోగుల క్లెయిమ్‌లను చెల్లించేలా చొరవ తీసుకున్నాం’ అని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడిన తర్వాత జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది మంది మాజీ ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.
ఇదీ చదవండి: సత్య సారథ్యంలో సమూల మార్పులు!


