సాఫ్ట్‌వేర్ రంగంలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తోన్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అత్యంత కీలకమైన పరివర్తనకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) కేవలం ఒక ఫీచర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ ఉనికికి పునాదిగా మారుతోందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెసీ సీఈఓ సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ తన పనితీరును, సంస్కృతిని, భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది.
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇకపై ఏఐని కేవలం ఉత్పత్తులకు అదనపు హంగుగా చూడటం లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉత్పత్తిని ఏఐ ఆధారంగానే తయారు చేయాలని భావిస్తుంది. ప్రస్తుత ఏఐ ప్రభావాన్ని ఒక ‘అరుదైన క్షణం’గా సత్య నాదెళ్ల అభివర్ణించారు. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వంటిది కాదని, కంపెనీకి ఇదో పూర్తి రీఇన్వెన్షన్‌గా మారే సమయమని అంతర్గత వర్గాలకు స్పష్టం చేశారు.
పాత పద్ధతులకు స్వస్తి
‘కంపెనీ ఉత్పత్తుల పరంగా చేసే పనుల్లో సత్య వేగాన్ని, అత్యవసరాన్ని (Urgency) కోరుకుంటున్నారు’ అని ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ వేగాన్ని అందుకోలేక పాత పని పద్ధతులకు అలవాటు పడిన కొందరు సీనియర్ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలా లేదా అన్నది తేల్చుకోవాలని నాదెళ్ల పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ‘మీరు దీన్ని ఎంతకాలం, ఎంత నిబద్ధతతో చేయాలనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోవాలి’ అని ఏఐలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఉద్యోగులను ఉద్దేశించి ఆ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఉత్పత్తుల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించడానికి నాదెళ్ల ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మేనేజ్‌మెంట్ వ్యవస్థలపై ఆధారపడకుండా ఆయన నేరుగా ఇంజినీర్లు, ఇతర బృందాలతో సమావేశమవుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ


