ప్రపంచంలోనే అత్యధికంగా డబ్బు కలిగి ఉన్న ఫ్యామిలీల జాబితా విడుదలైంది. అర ట్రిలియన్ డాలర్లతో వాల్టన్ కుటుంబం ఇందులో రికార్డు సృష్టిస్తే, టాప్-10లో పాగా వేసి అంబానీ ఫ్యామిలీ సత్తా చాటింది. 2025లో అధికంగా ప్రపంచ సంపద ఎవరి గుప్పిట్లో ఉందో తెలియజేస్తూ బ్లూమ్‌బెర్గ్ నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని అంశాల ప్రకారం..
ప్రపంచంలోని టాప్ 25 ధనిక కుటుంబాల సంపద 2.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
గత ఏడాది కంటే ఈసారి సంపదలో 358.7 బిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది.
ఈ ఏడాది నాలుగు వేర్వేరు ఖండాల నుంచి కొత్త కుటుంబాలు ఈ జాబితాలో చేరాయి. మెక్సికోకు చెందిన లారియా మోటా వెలాస్కో, చిలీకి చెందిన లుక్సిక్స్, ఇటలీకి చెందిన డెల్ వెచియోస్, సౌదీకి చెందిన ఒలయాన్స్ కుటుంబాలు మొదటిసారి ఈ ఎలైట్ క్లబ్‌లో చోటు దక్కించుకున్నాయి.
అగ్రస్థానంలో వాల్టన్ ఫ్యామిలీ
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ వ్యవస్థాపక కుటుంబం(వాల్టన్ ఫ్యామిలీ) తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. వీరి నికర విలువ అర ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండటం విశేషం. దశాబ్దాలుగా రిటైల్ రంగంలో వీరు చూపుతున్న ప్రభావం తిరుగులేనిదిగా ఉంది.
పుంజుకున్న రాజకుటుంబాలు
ఈ ఏడాది జాబితాలో మిడిల్ ఈస్ట్ దేశాల హవా స్పష్టంగా కనిపిస్తోంది
1. అల్ నహ్యాన్ కుటుంబం (UAE): యూఏఈ పాలక కుటుంబం ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది.
2. అల్ సౌద్ కుటుంబం (Saudi Arabia): సౌదీ రాజకుటుంబం భారీ వృద్ధిని నమోదు చేసింది. 2024లో 6వ స్థానంలో ఉన్న వీరు 2025 నాటికి 3వ స్థానానికి ఎగబాకారు.
3. అల్ థానీ కుటుంబం (Qatar): ఖతార్ రాజకుటుంబం జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతోంది.
ఎనిమిదో స్థానంలో అంబానీ కుటుంబం
భారతదేశానికి చెందిన అంబానీ కుటుంబం మరోసారి ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. 105.6 బిలియన్ డాలర్ల నికర విలువతో బ్లూమ్‌బెర్గ్ టాప్ 25 జాబితాలో అంబానీలు 8వ స్థానంలో నిలిచారు. 1950లలో ధీరూభాయ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఈ గ్రూప్ పెట్రోకెమికల్స్ నుంచి టెలికాం, రిటైల్ వరకు దాదాపు అన్ని రంగాల్లో విస్తరించి భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదీ చదవండి: నిధుల నిర్వహణలో పారదర్శకత
టాప్ 10 రిచ్ ఫ్యామిలీలు..
| రాంక్ | కుటుంబం | దేశం/ప్రాంతం | అంచనా సంపద(డాలర్లలో) | కీలక వ్యాపార సామ్రాజ్యం |
|---|---|---|---|---|
| 1 | వాల్టన్ | యూఎస్ఏ | 513.4 బిలియన్లు | వాల్‌మార్ట్ (రిటైల్) |
| 2 | అల్ నహ్యాన్ | యుఎఐ (అబుదాబి) | 335.9 బిలియన్లు | చమురు, AI, పెట్టుబడులు |
| 3 | అల్ సౌద్ | సౌదీ అరేబియా | 213.6 బిలియన్లు | సౌదీ అరామ్కో |
| 4 | అల్ థాని | ఖతార్ | 199.5 బిలియన్లు | నేచురల్ గ్యాస్, రియల్ ఎస్టేట్ |
| 5 | హీర్మేస్ | ఫ్రాన్స్ | 184.5 బిలియన్లు | హెర్మేస్ (లగ్జరీ ఫ్యాషన్) |
| 6 | కోచ్ | యూఎస్ఏ | 150.5 బిలియన్లు | కోచ్ ఇండస్ట్రీస్ |
| 7 | మార్స్ | యూఎస్ఏ | 143.4 బిలియన్లు | పెంపుడు జంతువుల సంరక్షణ |
| 8 | అంబానీ | భారతదేశం | 105.6 బిలియన్లు | రిలయన్స్ ఇండస్ట్రీస్ |
| 9 | వెర్థీమర్ | ఫ్రాన్స్ | 85.6 బిలియన్లు | చానెల్ (లగ్జరీ బ్రాండ్) |
| 10 | థామ్సన్ | కెనడా | 82.1 బిలియన్లు | థామ్సన్ రాయిటర్స్ (మీడియా/డేటా) |


