మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు సంబంధించి సెబీ సవరించిన నిబంధనలు సమతుల్యంగా ఉన్నాయని, ఇన్వెస్టర్లతోపాటు, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నట్టు అయిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (యాంఫి) చైర్మన్ సందీప్‌సిక్కా తెలిపారు. కొత్త నిబంధనలతో ఫండ్స్ పరిశ్రమకు సైతం స్పష్టత ఏర్పడినట్టు చెప్పారు.
మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు చెల్లిస్తున్న ఫీజుల్లో మార్పులు ప్రతిపాదిస్తూ కొత్త కార్యాచరణను సెబీ బుధవారం ప్రకటించడం తెలిసిందే. ఏడేళ్ల నుంచి ఫండ్స్ సంస్థలు పెట్టుబడిదారుల నుంచి 0.05 శాతం అదనంగా వసూలు చేస్తున్న ఎగ్జిట్ లోడ్ నిబంధనకు ముగింపు పలకడం గమనార్హం. ఫండ్స్ సంస్థల నుంచి ఈక్విటీ పెట్టుబడులపై బ్రోకరేజీ సంస్థలు వసూలు చేస్తున్న చార్జీల గరిష్ట పరిమితిని 0.12 శాతం నుంచి 0.06 శాతానికి, డెరివేటివ్స్ చార్జీని 0.05 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గించింది.
ఈ ఏడాది ఆరంభంలో ఫండ్స్‌కు సంబంధించి సెబీ ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. అయితే, భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, తుది నిబంధనలను ఖరారు చేసినట్టు సెబీ చైర్మన్ తుహిన్‌కాంత పాండే చెప్పారు. దీంతో ఆరంభంలో అంత కఠినంగా తుది నిబంధనల్లేవన్నారు. సెబీ కొత్త నిబంధనలతో స్పష్టత ఏర్పడి, దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మరింత విస్తరించేందుకు అనుకూలిస్తుందని సిక్కా అభిప్రాయపడ్డారు. సెబీ నిర్ణయాల నేపథ్యంలో గురువారం అస్సెట్ మేనేజ్‌మెంట్ (ఏఎంసీ) కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ర్యాలీ చేశాయి.
ఇదీ చదవండి: భారత్‌లో చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ జోరు


