డాలర్‌తో 12 పైసలు పటిష్టం
90.26 స్థాయికి రికవరీ
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి కాస్త బలపడింది. ఫారెక్స్ మార్కెట్లో గురువారం డాలర్‌తో 12 పైసలు పుంజుకుని 90.26కు కోలుకుంది. ఆర్‌బీఐ జోక్యంతో కుదుటపడింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగిరావడమూ కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో 90.35 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 34 పైసలు పుంజుకుని 90.04 వరకు కోలుకుంది. చివరికి 12 పైసల లాభానికి పరిమితమైంది.
రూపాయిపై ఆందోళన లేదు
రూపాయి గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ తెలిపారు. చైనా, జపాన్ సైతం అధిక వృద్ధి దశలో కరెన్సీ బలహీనతను ఎదుర్కొన్నట్టు చెప్పారు. రూపాయి బలహీనతను, ఆర్థిక ఆందోళనతో ముడిపెట్టరాదన్నారు. 1990ల నుంచీ రూపాయి తన వాస్తవ విలువకు అనుగుణంగా చలించేందుకే అనుమతించినట్టు.. అధిక ఆటుపోట్లను తగ్గించే క్రమంలోనే ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందని చెప్పారు.


