డిసెంబర్ చివరి వారం వచ్చిందంటే చాలు.. ప్రపంచమంతా కొత్త ఉత్సాహం నిండుకుంటుంది. క్యాలెండర్ మారుతున్న వేళ, పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఈ సమయం కేవలం వేడుకలకే పరిమితం కాదు; ఇది ఒక భారీ ఆర్థిక చక్రానికి ఎనర్జీగా ఉంటుంది. నగరాల్లోని పబ్ కల్చర్ నుంచి గ్రామాల్లోని సెలబ్రేషన్స్ వరకు.. ఇయర్ ఎండింగ్ అనేది కోట్లాది రూపాయల వాణిజ్యానికి వేదికగా మారుతోంది.
డిసెంబర్ 31 రాత్రి.. గడియారం ముల్లు 12 గంటలు దాటకముందే దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థల గల్లా పెట్టెలు నిండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారత్‌లో పండుగ సీజన్, ఇయర్ ఎండింగ్ ఖర్చులు సుమారు 32% పెరిగాయని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. విశేషమేమిటంటే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈవెంట్ కల్చర్ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు, పల్లెటూళ్లకు కూడా పాకింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. డిసెంబర్ ముగింపు అంటే ఒక వేడుక కాదు, అదొక భారీ వాణిజ్య జాతర!
నగరాల్లో ఈవెంట్లు - కార్పొరేట్ వాణిజ్యం
నగరాల్లో ఇయర్ ఎండింగ్ అంటేనే విలాసవంతమైన పార్టీలు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, స్టే-కేషన్లు(స్టేయింగ్+వెకేషన్స్ Staycations). ఇక్కడ వాణిజ్యం ప్రధానంగా వివిధ రంగాల్లో కేంద్రీకృతమై ఉంటుంది.
హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లు ఒక నెల ముందే బుకింగ్‌లు ప్రారంభిస్తాయి. ఒక్కో ఎంట్రీ టికెట్ ధర సుమారు రూ.2,000 నుంచి రూ.20,000 అంత కంటే ఎక్కువే పలుకుతుంది. డీజేలు, డ్యాన్సర్లు, లైటింగ్ డెకరేటర్లకు ఈ సమయంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
నగరవాసులు ఇయర్ ఎండింగ్ కోసం గోవా, పాండిచ్చేరి, కేరళ.. వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం వల్ల ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు లాభాలను ఆర్జిస్తాయి.
బట్టలు, గాడ్జెట్లు, కానుకల అమ్మకాలు పెరగనున్నాయి. ఇయర్ ఎండింగ్ సేల్ పేరుతో షాపింగ్ మాల్స్ ఇచ్చే ఆఫర్లు మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షిస్తాయి.
ఇదీ చదవండి: పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!


