టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడుల జోష్
2025లో 10.5 బిలియన్ డాలర్లు
ప్రపంచవ్యాప్తంగా టాప్–3లో భారత్
దేశీయంగా వెల్లువెత్తుతున్న స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ముందున్నాయి! ఈ బాటలో మహిళలు తెరతీస్తున్న స్టార్టప్‌లు సైతం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. వివరాలు చూద్దాం..
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్ స్టార్టప్‌లకు ప్రస్తుత కేలండర్ ఏడాది(2025) 10.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. గతేడాది(2024) అందుకున్న 12.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే 17 శాతం తగ్గాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూఎస్, యూకే తదుపరి భారత్ మూడో ర్యాంకులో నిలవడం గమనార్హం!
ఈ బాటలో చైనా, జర్మనీ కంటే ముందు నిలవడం విశేషం! మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్షన్ నివేదిక వివరాలివి. వీటి ప్రకారం స్టార్టప్‌ల ఫండింగ్‌లో దేశీయంగా బెంగళూరు, ముంబై టాప్ ర్యాంకును కొల్లగొట్టాయి. కాగా.. దేశీ టెక్ స్టార్టప్‌లు 2023లో 11 బిలియన్ డాలర్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే తాజాగా నిధుల సమీకరణ 4 శాతం క్షీణించింది.
దశలవారీగా విభిన్నం
టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు వివిధ దశలలో విభిన్నంగా నమోదయ్యాయి. ఈ ఏడాది సీడ్ దశలో 1.1 బిలియన్ డాలర్లు లభించగా.. 2024తో పోలిస్తే 30 శాతం నీరసించాయి. 2023తో చూసినా ఇది 25 శాతం క్షీణత. ఇక తొలి దశ ఫండింగ్ 7 శాతం పుంజుకుని 3.9 బిలియన్ డాలర్లను తాకింది. 2024లో ఇది 3.7 బిలియన్ డాలర్లుకాగా.. 2023లో సాధించిన 3.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 11 శాతం అధికం. వృద్ధికి సిద్ధంగా ఉన్న, బలపడే వీలున్న టెక్ స్టార్టప్‌లపట్ల గ్లోబల్ ఇన్వెస్టర్లలోగల విశ్వాసాన్ని తాజా ట్రెండ్ ప్రతిబింబిస్తోంది. అయితే చివరిదశ స్టార్టప్‌లు పెట్టుబడులను ఆకట్టుకోవడంలో వెనకడుగు వేశాయి. 2024లో 7.5 బిలియన్ డాలర్లు సమకూర్చుకోగా.. ప్రస్తుత ఏడాది 26 శాతం తక్కువగా 5.5 బిలియన్ డాలర్లు మాత్రమే లభించాయి.
క్రమశిక్షణాయుతంగా
దేశీ టెక్ స్టార్టప్‌లలో క్రమశిక్షణాయుత పెట్టు బడులు నమోదవుతున్నట్లు ట్రాక్షన్ సహవ్యవస్థా్థపకుడు నేహా సింగ్ పేర్కొన్నారు. తొలి దశ ఫండింగ్‌లో పెట్టుబడులు కొనసాగుతుండటం, ఐపీవో యాక్టివిటీ పుంజుకోవడం, యూనికార్న్‌ల ఆవిర్భావంలో నిలకడ వంటి అంశాలు బలపడిన ఎకోసిస్టమ్‌ను ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో వృద్ధికి వీలున్న, అత్యంత నాణ్యమైన బిజినెస్‌లకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు తెలియజేశారు. వెరసి ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్, రిటైల్, ఫిన్‌టెక్ సంస్థల పట్ల ఆసక్తి కనిపిస్తున్నట్లు వివరించారు.
భారీ డీల్స్..
ఈ ఏడాది దేశీయంగా 10 కోట్ల డాలర్లకుపైబడిన 14 పెట్టుబడి రౌండ్లు నమోదయ్యాయి. 2024లో ఇవి 19కాగా.. 2023లో ఈ తరహా 16 డీల్స్ నమోదయ్యాయి. ప్రధానంగా ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ టెక్, ఎని్వ రాన్‌మెంట్ టెక్, ఆటో టెక్ రంగాలలో భారీ డీల్స్ నమోదవుతున్నాయి. వీటిలో బిలియన్ డాలర్ల ఎరిషా ఈ మొబిలిటీ డీ రౌండ్, 30 కోట్ల డాలర్ల జెప్టో సిరీస్ హెచ్ రౌండ్, 27.5 కోట్ల డాలర్ల గ్రీన్‌లైన్ సిరీస్ ఏ ఫండింగ్‌ను చెప్పుకోదగ్గ డీల్స్‌గా నివేదిక ప్రస్తావించింది. ఆయా సంస్థల మెచ్యూరిటీ, విలువ, భిన్న లక్ష్యాల ఆధారంగా స్టార్టప్‌ల ఫండింగ్‌లో ఏ, డీ, హెచ్ తదితర రౌండ్ల(సిరీస్‌లు)కు తెరతీసే సంగతి తెలిసిందే.
మహిళా సంస్థలు
దేశీయంగా మహిళలు సహవ్యవస్థాపకులుగా ఆవిర్భవించిన టెక్ స్టార్టప్‌లు ఈ ఏడాది బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. వీటిలో 6.2 కోట్ల డాలర్ల జివా సిరీస్ సి, 5.2 కోట్ల డాలర్ల ఆమ్నెక్స్ సిరీస్ ఏలను నివేదిక పేర్కొంది. రిటైల్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ అత్యధికంగా నిధులు అందుకున్న రంగాలుకాగా.. ఇందుకు బ్రాండ్ ఆధారిత ఎగ్జిక్యూషన్, పటిష్ట కన్జూమర్ డిమాండ్, ఎంటర్‌ప్రైజ్ నిర్వహణ ప్రభావం చూపాయి. మహిళలు తెరతీసిన స్టార్టప్‌లలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ ముందున్నాయి.


