ఫ్లిప్‌కార్ట్‌లో చీఫ్ ప్రొడక్ట్, టెక్నాలజీ ఆఫీసర్‌గా లోగడ పనిచేసిన జేయంద్రన్ వేణుగోపాల్‌ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) ప్రెసిడెంట్, సీఈవోగా నియమించుకుంది. ఆర్‌ఆర్‌వీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ, రిలయన్స్ రిటైల్ నాయకత్వ బృందంతో కలసి.. ముకేశ్ అంబానీ, మనోజ్ మోదీ మార్గదర్శకం కింద వేణుగోపాల్ పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
రిటైల్, ఈ–కామర్స్, టెక్నాలజీ, బిజినెన్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో 25 ఏళ్ల అనుభవం ఉన్న వేణుగోపాల్.. రిటైల్ పోర్ట్‌ఫోలియోని బలోపేతం చేస్తారని, ఓమ్ని ఛానల్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) వృద్ధిని వేగవంతం చేస్తారని, రిలయన్స్ రిటైల్ వ్యాల్యూ చైన్ వ్యాప్తంగా సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను తీసుకొస్తారని భావిస్తున్నట్టు పేర్కొంది. మింత్రాను దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దడంలో వేణుగోపాల్ ముఖ్యపాత్ర పోషించారు. అంతకుముందు యాహూ, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లోనూ పనిచేశారు.


