విహారయాత్రలంటే ఎవరికి మాత్రమే ఇష్టం ఉండదు చెప్పండి, ఏడాదిలో ఏదో ఒకసారైనా.. ఒంటరిగా లేదా కుటుంబంతో అయినా.. అలా కొత్త ప్రదేశాలను సందర్శించి సంతోషపడుతుంటారు. టూర్ వెళ్లడానికి కొందరు వేసవి కాలం ఎంచుకుంటే, మరికొందరు శీతాకాలం ఎంచుకుంటారు. అయితే.. చాలామంది శీతాకాల ప్రయాణమే ఎంచుకుంటారని ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) ఒక సర్వేలో వెల్లడించింది.
భారతదేశంలో చాలామంది ప్రయాణికులు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి లేదా విహారయాత్రలకు వెళ్లడానికి శీతాకాలాన్ని ఎంచుకుంటున్నారని ఎయిర్‌బీఎన్‌బీ 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ సర్వే ద్వారా స్పష్టం చేసింది. చల్లని వాతావరణం.. అందమైన ప్రదేశాలను అన్వేషించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంటుందని.. ఈ కారణంగానే ఈ కాలంలో ప్రయాణాలకు షెడ్యూల్ చేసుకుంటున్నారని వెల్లడించింది.
భారతీయులలో 30 శాతం మంది శీతాకాలంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి ఎంచుకుంటుంటే.. మరో 30 శాతం మంది విశ్రాంతి తీసుకోవడానికి ప్రయాణాలు చేస్తున్నారు. 20 శాతం మంది కాలానుగుణ లేదా సాంస్కృతిక అనుభవాలను కనుగొనడానికి ప్రయాణం చేస్తున్నారని సర్వేలో ఎయిర్‌బీఎన్‌బీ చెప్పుకొచ్చింది.
50 శాతం మంది ప్రజలు జీవిత భాగస్వామితో ప్రయాణించడానికి ఇష్టపడతారు. మూడవ వంతు స్నేహితులతో, 30 శాతం మంది ఉమ్మడి కుటుంబాలతో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారని సర్వేలో ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. ఇందులో కూడా చాలామంది ముందుగా గోవా, కేరళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తరువాత జాబితాలో తిరువనంతపురం, కొచ్చి వంటి ప్రదేశాలలోని బీచ్‌లు, కేఫ్‌లు, తీరప్రాంతాలు ఉన్నాయి. 2025 అక్టోబర్ 13-20 మధ్య దేశవ్యాప్తంగా 2,155 మందితో సర్వే నిర్వహించి 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ నివేదిక విడుదల చేసింది.


