అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్క రోజే 1,000 పైగా విమానాలను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు.
ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షోభంపై దాని సీఈవో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను "రీబూట్" చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దు సంఘటనలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. రాబోయే 5-10 రోజుల్లో అంటే డిసెంబర్ 10-15 నాటికి క్రమంగా కోలుకుని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు.
సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్ లో ఉంచింది.


