కొత్త సంవత్సరం వస్తోంది. ఉద్యోగులు వచ్చే ఏడాది ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నూతన సంవత్సరం మరింత ఖరీదైన వైద్య ఖర్చుల భారాన్ని కూడా మోసుకొస్తోంది. దేశంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు 2026లో 11.5% పెరుగుతాయని అయోన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ రిపోర్ట్ తెలిపింది.
వైద్య ఖర్చుల పెరుగుదల 2025లో ఉన్న 13% కంటే కొత్త ఏడాదిలో తక్కువే అయినప్పటికీ దేశ వైద్య సంబంధ ద్రవ్యోల్బణం ప్రపంచ సగటు 9.8% కంటే ఎక్కువగా ఉంది. హృదయ సంబంధ వ్యాధులు, జీర్ణశయ రుగ్మతలు, క్యాన్సర్ వంటివి వైద్య ఖర్చులను మరింత పెంచుతాయని నివేదిక హైలైట్ చేస్తోంది. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పోషకాహారలేమి వంటి కారకాలు ఖర్చుల భారం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది.
వైద్య ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయంటే..
ఇటీవల కాలంలో వైద్య సాంకేతికతల్లో అత్యంత పురోగతి వచ్చింది. కొత్త కొత్త వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన రొబోటిక్స్, ఏఐ టెక్నాలజీని వైద్య చికిత్సల్లో వినియోగిస్తున్నారు.
ప్రాణాంతకమైన అనేక జబ్బులకు ఇటీవల నూతన ఔషధాలు కనుగొంటున్నారు. సాధారణంగా ఇవి అత్యంత ఖరీదైనవిగా ఉంటున్నాయి.
దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఆస్థాయిలో నాణ్యమైన ఆసుపత్రులు, నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులు ఉండటం లేదు. దీంతో మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది.
పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి రక్షించుకోవడానికి చాలా మంది ఉద్యోగులు వైద్య బీమాను ఆశ్రయిస్తుంటారు. అయితే వాటిలో ఇటీవల క్లెయిమ్‌లు పెరగడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంలను పెంచేస్తున్నాయి.


