ఆన్‌లైన్ బెట్టింగ్, గాంబ్లిక్ యాప్‌లతో యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు కోట్ల రూపాయలు దండుకున్నారనే విషయాన్ని విన్నాం. అక్రమ సంపాదనతో వారు గడిపే విలాసవంతమైన జీవితం గురించి తెలుసుకున్నాం కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని ఒక యూట్యూబ్ అక్రమ సంపాదన, లంబోర్గిని మెర్సిడెస్ బెంజ్‌తో సహాలగ్జరీ కార్ల గురించి తెలుసుకుంటే మాత్రం ఔరా అన్నాల్సిందే. ఇంతకీ ఎవరా యూట్యూబర్? తెలుసుకుందాం పదండి.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హై-ఎండ్ స్పోర్ట్స్కార్లతో నిండిన గ్యారేజ్ చూసి ఈడీ అధికారులే నివ్వెర పోయారు. లంబోర్గిని ఉరుస్, BMW Z4, మెర్సిడెస్-బెంజ్‌తో సహా నాలుగు హై-ఎండ్ కార్లు వీటిల్లో ఉన్నాయి.
బ్యాంకు లావాదేవీలు, ఆస్తి పత్రాలు మరియు డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు సంస్థకు చెందిన 16 మంది సభ్యుల బృందం బుధవారం నవాబ్‌గంజ్, ఉన్నావ్ మరియు లక్నోలోని అనురాగ్ ప్రాంగణాలపై దాడి చేసింది. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ద్వివేది బెట్టింగ్, జూదం యాప్‌లను ప్రమోట్ చేశాడు. ఫలితంగా ఎంతో అమాయకులు ఈ యాప్‌లలో చేరారని, దీంతో చట్టవిరుద్ధ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించారని ఈడీ తెలిపింది. భారతదేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల ద్వారా ద్వివేది సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం స్కై ఎక్స్ఛేంజ్, ఇతర యాప్‌ల నుండి వచ్చాయట. ఇలా వచ్చిన ఆదాయాన్ని వివిధ మార్గాల ద్వారా లాండరింగ్ చేసి, ఆపై లగ్జరీ కార్లు, ఇతర ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించారని ఈడీ అధికారులు తెలిపారు. హవాలా ఆపరేటర్లు, మ్యూల్ ఖాతాలు, మధ్యవర్తుల ద్వారా సేకరించిన నగదు డెలివరీల ద్వారా అనేక అక్రమ ఆస్తిని కూడబెట్టాడు. అతని కంపెనీల బ్యాంకు ఖాతాల్లో, అతని కుటుంబ సభ్యుల ఖాతాలలో అక్రమంగా పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది. దీన్నిభారతదేశం వెలుపల, ముఖ్యంగా దుబాయ్‌లో స్థిరాస్తుల కొనుగోలు కూడా చేశాడని ఈడీ గుర్తించింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో, ఎంత డబ్బు అక్రమంగా సంపాదించారో, ఎక్కడ పెట్టుబడి పెట్టారో అనే దానిపై ఈడీ కూపీ లాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంచనా.
పశ్చిమ బెంగాల్ సిలిగురిలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. సోషల్‌మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోను కుమార్ ఠాకూర్, విశాల్ భరద్వాజ్ సహా మరికొంతమంది నిందితులను పోలీసులు గుర్తించారు.
ఎవరీ అనురాగ్
ఉన్నావ్‌లోని ఖజూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అనురాగ్ ద్వివేది ఒకప్పుడు సాధారణ జీవితాన్ని గడిపాడు. పదేళ్ల క్రితం, సైకిల్‌పై ప్రయాణించేవాడు. అతని తండ్రి లక్ష్మీనాథ్ ద్వివేది, మాజీ గ్రామ అధిపతి. అనురాగ్ 2017-18లో క్రికెట్ బెట్టింగ్ నెట్‌వర్క్‌లలో చేరాడు , డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ల కోసం వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. అతని అంచనాలు మరియు గేమింగ్ కంటెంట్ అతన్ని ప్రజాదరణ పొందేలా చేసింది. అతనికి యూట్యూబ్‌లో 7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
దుబాయ్‌లో క్రూయిజ్‌లో అట్టహాసంగా పెళ్లి, క్లూ దొరికింది
2024 నవంబర్ 22న అనురాగ్ దుబాయ్‌లో లగ్జరీ క్రూయిజ్‌లో లక్నోకు చెందిన తన ప్రియురాల్ని పెళ్లాడాడు. దాదాపు 100 మంది బంధువులను వివాహానికి విమానాల్లో తరలించాడు. వీరి హోటళ్ళు, ఆహారం అన్ని ఖర్చులను అనురాగ్ భరించాడు. పలు బాలీవుడ్ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. విలాసవంతమైన ఏర్పాట్లను చూసి బంధువులే ఆశ్చర్యపోయారు. ఇదే ఈడీనిదృష్టికి చేరింది. తాజాగా 12 గంటల పాటు భారీ దాడులు నిర్వహించింది సోషల్ మీడియా ప్రభావాన్ని ఉపయోగించి యువతను ఈ యాప్‌ల వైపు ఆకర్షించాడని ED ఆరోపిస్తోంది. అనురాగ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
(ఘోర విమాన ప్రమాదం, నాస్కార్ మాజీ డ్రైవర్‌తో సహా ఏడుగురు దుర్మరణం)


