ట్రాఫిక్‌.. గీఫిక్‌.. జాన్తా నై! | foreigner forcing riders to move out of footpath in Pune viral Video | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌.. గీఫిక్‌.. జాన్తా నై!

Dec 19 2025 1:45 PM | Updated on Dec 19 2025 3:49 PM

foreigner forcing riders to move out of footpath in Pune viral Video

రూల్స్ ఉండేవే బ్రేక్ చేయడానికి అన్న వాదన నుంచి పుట్టిన సిద్ధాంతం మనది. అందుకే ఎప్పుడు రూల్స్  గురించి మాట్లాడినా.. రాద్ధాంతం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటారా.. ఇది మరీ విడ్డూరం. దేశంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న.. అందరూ కాకపోయినా ట్రాఫిక్ పోలీసుల మెప్పు పొందిన వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. 

రూల్స్ పాటించడమంటేనే చేతకాని తనానికి నిదర్శనమని త్రికరణశుద్ధిగా నమ్ముతుంటాం. అందుకే ఎదుటి వారికి చెప్పేటందుకే రూల్స్ ఉన్నాయి.. డోంట్ కేర్ అంటూ ఏఎన్నార్ లెక్కన పాటలు పాడుకుంటూ నిర్లక్ష్యంగా తిరిగే వారే ఎక్కువ. ఏదైన రూల్ ఉందంటే అది రాజుగారి గదిలాంటిది. రాజుగారి గదిలోకి మాత్రం వెళ్లకండి అంటే.. కచ్చితంగా అందులోకే వెళ్లడం సగటు భారతీయుని నైజం. ఇదీ అంతే.. రూల్స్ అంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ చెప్పొచ్చావులే పేద్ద.. రూల్స్‌ అంట రూట్స్‌.. అని ఆరున్నొక్క రాగాల దీర్ఘం తీయడం మనకు అలవాటై పోయింది.

గీ ట్రాపిక్ పురాణం పొద్దుపొద్దులా మాకెందుకు బై అంటే.. జర ఆగుండ్రి మరి.. మన సివిక్ సెన్స్ చూసి విదేశీయులే నోరెల్ల బెడ్తుండ్రంట. పుణెలో ఓ విదేశీయుడు మనోళ్లు ఫుట్‌పాత్‌ల మీదికెళ్లి మోటార్‌ బైకులు చెలాయిస్తూంటే వారిని ఆపి.. ఏందిది? అని అడుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అందుకే.. ఇక్కడే కాదు.. దేశంలో చాలా చోట్ల విదేశీయులు మన భారతీయుల ఉల్లం‘ఘనుల’ను చూసి.. అరే ఎంత దర్జాగా రూల్స్ వదిలేసి తిరుగుతుండ్రని నోళ్ళు నొక్కుకుంటుండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీలో సైకిల్ తిరగాల్సిన చోట వాహనాలు హల్ చల్ చేస్తుంటే.. చూస్తున్న విదేశీయులు రంగప్రవేశం చేసి జనాలకు బాబూ దీన్ని బైసైకిల్‌ లేన్ అంటారు. ఇక్కడ కేవలం సైకిల్స్ తిరగాలి అంతేకానీ.. ఎడాపెడా పెద్ద వాహనాలు రాకండి అంటూ నిలబడి మరీ చెప్పడం ప్రారంభించారు.

కొందరు వీరి మాటలు వింటున్నట్లు నటించినా.. మరి కొందరు బేఫికర్‌గా వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అరే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ గురించి విదేశీయులు అర్థం చేసుకుని ఇలా పాటించాలి బాబూ అంటున్నా.. వినకుండా వారు అలా చెబుతున్నందుకు విసుక్కొంటున్నారట. పాపం విదేశీయులకు మన థియరీ అర్థం కాలేదు. అరే వీరేందిర బై రూల్స్ అన్నాక ఫాలో కావాలి కదా. పనిగట్టుకుని మరీ  రూల్స్ బ్రేక్ చేస్తే వీరికి మాత్రం ఒరిగేదేంటి? అని లోలోపల మదనపడుతున్నారట. విదేశీయులు మన భారతీయులకు ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.

మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.

అరే ఇదేందిర బై వన్ వే అంటూ రాసిండు గదా.. ఇట్టే వస్తున్నవేంది? అని ఎవరైనా అడిగితే... చుట్టూ ఎలితే లంబా అవుతది గందుకే షార్ట్ గా ఈ తొవ్వలో వస్తుండ అంటూ యమ కూల్ గా సమాధానం చెబుతారు. హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు జర ఫోర్స్ చేసిండ్రు అంటే.. గదేంది సర్ పొద్దునే ఈ రూట్ లో ఇట్టే వెళ్ళా.. గప్పుడు కూడా లేదు.. ఇప్పుడు అడుగుడేంది అంటూ ఉల్టా ప్రశ్న వేస్తుంటే సదరు పోలీసు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇగ హారన్ కొట్టుడు అంటే మనకు మస్త్ మజా వస్తది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా.. హారన్ దంచుతునే ఉంటం.. అరె బై ఆ సప్పుడేంది.. ట్రాఫిక్ ఉంది కదా అని విసుక్కొన్నారో.. హారన్ సౌండ్ మరింత పెరుగుతుంది. అదే విదేశాల్లో హారన్ కొట్టడం అంటే న్యూసెన్స్ గా భావిస్తారు.

విదేశాల్లో ఇలా అంటే చాలు ఆ మా బాగా చెప్పొచ్చావులే.. అక్కడికే వెళ్ళలేకపోయావా అంటూ వ్యంగ్యం దట్టించి మరీ మాటలు వదులుతుంటారు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే.. యూరోపియన్ దేశాల్లో అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పట్టింపు చాలా ఎక్కువ. రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు సైకిల్ పై వెళ్లే వారికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. ప్రభుత్వ బస్సులు నడపడానికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. పాదచారులకు వారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. పెడస్ట్రియన్ సిగ్నల్ పడిందంటే.. ఎన్ని వాహనాలైనా సరే అటూ ఇటూ నిలిచి వేచి చూడాల్సిందే. 

అలాగే స్కూల్ జోన్ వద్ద సైలంట్ జోన్ అని ఉంటుంది. అక్కడ హారన్ మోగిస్తే ఫైన్ కట్టాలి. అలాగే స్కూల్, హాస్పిటల్ వద్ద స్పీడుగా వెళ్ళినా పెనాల్టీ డబుల్ ఉంటుంది. టొరంటోలో ట్రాఫిక్ ఎప్పుడూ హెవీగానే ఉంటుంది. కానీ ప్రమాదాల శాతం చాలా తక్కువ. మనకూ ట్రాఫిక్ రూల్స్ బోలెడన్ని ఉన్నాయ్.. పాటించేవారి సంఖ్యే తక్కువ. రూల్స్ బ్రేక్ చేయడమంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. అది తప్పని కూడా అనుకోం. పాపం ఢిల్లీలో విదేశీయులు మన అరాచకం చూసి అల్లాడిపోయారు. కనీసం రూల్స్ చెబితే పాటిస్తారేమోనని అనుకుని చెప్పడం ప్రారంభించారు. వారిది ఎంత దురాశో కదా.
-ఆరెం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement