‘ఇది పెళ్లి వేడుకా? పాన్ ఇండియా సినిమానా?’ అని ఆశ్చర్యపోయారు అతిథులు. వేడుకలో అడుగడుగునా సినిమాటిక్ ట్రిక్స్‌ను ఉపయోగించడమే దీనికి కారణం. వేదికపై రైలు పట్టాలు కనిపిస్తాయి. అయితే ఆ పట్టాల మీది నుంచి రైలు కాదు... అటు నుంచి హంసతూలికా వాహనంలో వధువు, ఆమెకు ఎదురుగా మరో హంసతూలికా వాహనంలో వరుడు వస్తుంటాడు.
బ్యాక్‌గ్రౌండ్‌లో అలనాటి ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లోని పాటలు వినిపిస్తుంటాయి. వధూవరుల చేతిలో స్పార్క్–షూటింగ్ గన్స్ ఉంటాయి. ఇద్దరూ ఒకే చోటుకి రాగానే పూల వెలుగు వాన కురుస్తుంది. బాణసంచా పేలుతుంది.
ఒక్కటా రెండా... ఈ పెళ్లి వేడుకలో ఎన్నో వింతలు.‘ఎంత గొప్ప క్రియేటివిటో... ఆహా!’ అని ఆకాశానికెత్తారు కొందరు. చాలామంది మాత్రం... ‘ఎవరి పిచ్చి వారికి ఆడంబరం’ అన్నట్లుగా కామెంట్స్ పెట్టారు. అయినప్పటికీ ఈ వీడియో వైరల్ అయింది. రాబోయే కాలంలో ఇదొక ట్రెండ్‌గా కూడా మారవచ్చు!


