అల్లాహ్ నిదర్శనాలలో భూమి ఆకాశాల సృష్టి కూడా ఒకటి. ఆ రెండింటి లోనూ జీవరాశులను వ్యాపింపజేసి ఉంచాడు. తాను తలుచుకున్నప్పుడు వాటిని పరలోకంలో ఒక చోట సమీకరించగలడు.
ఖుర్‌ఆన్ భావామృతం: 42:28–29 వివరణ: ఈ సూక్తిని బట్టి జీవరాసులలో మన భూమి పైననే గాక ఇతర గ్రహాలలో కూడా జీవరాసులు ఉన్నాయని తెలుస్తోంది. ఆ దేవుడే ఏడు ఆకాశాలు సృష్టించాడు. అలాంటివే భూమిని పోలిన వాటిని కూడా సృష్టించాడు. వాటిపై కూడా ఆయన ఆజ్ఞలు అవతరిస్తూ ఉంటాయి. దేవుడు ప్రతిదానిపై అదుపు ,అధికారం గల సమర్థుడు. సర్వశక్తిమంతుడని ఆయన జ్ఞానం ప్రతి వస్తువుని ప్రతి విషయాన్ని పరివేష్టించి ఉందని మీరు తెలుసుకోవడానికే ఈ సంగతి తెలియజేయబడుతోంది.
(ఖుర్‌ఆన్ భావామృతం:65:12) వివరణ: ఇలాంటివే మీ భూమిని పోలిన వాటిని కూడా సష్టించాడు అంటే ఏడు ఆకాశాల్లో ఏడు భూములు మాత్రమే సష్టించాడని కాదు. ఇది అర బి భాషలో పెద్ద సంఖ్యను కూడా సూచిస్తుంది. భూమిని పోలిన వాటిని అంటే బుద్ధి జీవులు గల మన భూమిని పోలిన భూములు అని అర్థం. దీన్నిబట్టి మన విశ్వంలో మనలాంటి బుద్ధి జీవులు ఉండే అనేక గ్రహాలు ఉన్నాయని తెలుస్తోంది. హజ్రత్ ఇబ్నెఅబ్బాస్ రజి ఈ సూక్తి గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు: వాటిలోని ప్రతి భూమండలంలో ముహమ్మద్ ప్రవక్తను పోలిన ప్రవక్తలు ఉన్నారు; ఆదం అలైను పోలిన ఆదంలు ఉన్నారు; నూహ్ అలైను పోలిన నూహ్ లు ఉన్నారు.
ఇబ్రాహీం అలైను పోలిన ఇబ్రాహీంలు ఉన్నారు; ఈసా అలై ను పోలిన ఈసాలు ఉన్నారు. క్వాంటం సిద్ధాంతం ఆధారంగా హ్యూగ్ ఎవరెట్ ప్రతిపాదించిన మల్టీ యూనివర్స్ సిద్ధాంతం ప్రకారం మన భూమండలానికి ఇక్కడున్న సృష్టి రాశులకు నకళ్లు ఉంటాయట! ఎకానమమిస్ట్ (లండన్) అనే పత్రిక 26–7–1969 సంచిక ప్రకారం అమెరికాకు చెందిన ర్యాండ్ కార్పొరేషన్ సంస్థ ఇతర గ్రహాలలో బుద్ధి జీవుల ఉనికిని గురించి పరిశోధన జరిపింది. దాని ప్రకారం మన పాలపుంతలో మన భూమి వాతావరణాన్ని పోలిన అరవై కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలలో జీవరాసులు ఉండవచ్చని కూడా ఈ పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ యథార్థాన్ని 1400 సంవత్సరాల క్రితమే ముస్లిం పండితులు తెలియజేశారు.
(ఖుర్ ఆన్ భావామృతం 65:12).
– మొహమ్మద్ అబ్దుల్ రషీద్


