భారత్‌లో అంతగా ఫ్యాషన్ , అందాల పోటీలకు ప్రాచుర్యం లేని సమయంలో ముంబైకి చెందిన మెహర్ కాస్టెలినో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఈ ఘనత సాధించిన తొలిభారతీయ మహిళ నిలిచింది. ఆడవాళ్లు ధైర్యంగా తమకు నచ్చిన రంగంలో ధైర్యంగా దూసుకుపోవచ్చు అనేందుకు స్ఫూర్తిగా నిలిచారామె. ఈ రోజు ఇంతలా అందాల పోటీలకు క్రేజ్ వచ్చిందంటే అందుకు కాస్టలినోనే కారణమని చెప్పొచ్చు.
అలాంటి శక్తిమంతమైన మహిళ 81 ఏళ్ల వయసులో అనారోగ్యంతో డిసెంబర్17న(బుధవారం) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కోడలు నిషా, మనవరాలు క్రిస్టినా ఉన్నారు. ఫ్యాషన్ ప్రపచంలో భారతీయ మహిళలకు మార్గదర్శకురాలిగా ఉన్నా ఆమె ప్రస్థానం, సాధించిన విజయాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
భారత్కు ఫ్యాషన్ జర్నలిజాన్ని నేర్పించిన ఐకాన్, మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో(Meher Castelino). 1964లో మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. దీని తర్వాత కూడా ఈమె మిస్ యూనివర్స్, మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీలలో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించారు.
తొలి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్‌గా, ఆమె విజయం భారత అందాల పోటీల చరిత్రలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది. కాస్టెలినోని నిశ్శబ్ద బలానికి చిహ్నంగా అభివర్ణిస్తూ, భారతదేశంలో ప్రారంభ ఫ్యాషన్, అందాల పోటీల దృశ్యాన్ని రూపొందించడంలో సహాయపడిన మార్గదర్శకురాలిగా ఫ్యాషన్ ప్రపంచం ఆమెను సదా కీర్తిస్తుంది.
తొలితరం ఫ్యాషన్ జర్నలిస్టు కూడా..!
మోడలింగ్, టైటిల్ విన్నింగ్ తర్వాత మెహర్ ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగు పెట్టారు. 1973లో ఈవ్స్ వీక్లీ లో తన మొదటి కథనాన్ని ప్రచురించారు. చాలా కొద్ది టైమ్ లోనే మెహర్ ఫ్యాషన్ కాలమిస్ట్ గా ఎదగి..160 జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో వ్యాసాలు రాశారు. మ్యాన్‌స్టైల్’, ‘ఫ్యాషన్ కెలిడోస్కోప్’ వంటి పుస్తకాలు కూడా ఆమె రచించారు.
సింపుల్‌గా చెప్పాలంటే..భారత్‌లో ఫ్యాషన్ జర్నలిజానికి మెహర్ కాస్టెలినో ఐకాన్‌గా పేర్కొనవచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అనేక ప్రధాన ఫ్యాషన్ ఈవెంట్లకు ఆమె అధికారిక ఫ్యాషన్ రైటర్‌గా పనిచేశారు. ఫ్యాషన్‌ను కేవలం సెలబ్రిటీల గ్లామర్‌గా కాకుండా, ఒక పరిశ్రమగా విశ్లేషించిన తొలితరం జర్నలిస్టులలో ఆమె ఒకరు.
భారతదేశంలో ఫ్యాషన్ రంగం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఒక మహిళగా ప్రభంజనం సృష్టించి చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి మార్గదర్శకురాలిగా, స్ఫూర్తిగా నిలిచారామె.
(చదవండి: వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..)


