లండన్‌లో వేలానికి సిద్ధం
లండన్: సెంట్రల్ లండన్ స్క్వేర్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రఖ్యాత శిల్పం మినియేచర్ మోడల్ వచ్చే వారం ఇంగ్లండ్‌లో వేలానికి రానుంది. దీని ధర 6 వేల నుంచి 8 వేల పౌండ్లు, అంటే సుమారుగా రూ.6.27 లక్షల నుంచి రూ.8.36 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 27 సెంటీమీటర్ల ఎత్తుండే ఈ కాంస్య మినియేచర్ విగ్రహం, 1968లో లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని టావిస్టాక్ స్క్వేర్‌లో నెలకొల్పిన విగ్రహానికి ప్రతిరూపంగా చెబుతున్నారు.
గాంధీజీ లా చదువుకున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ టావిస్టాక్ స్క్వేర్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ విగ్రహాన్ని పోలెండ్ శిల్పి ఫ్రెడ్డా బ్రిలియంట్ రూపొందించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ విగ్రహంపై కొందరు జాతి విద్వేష రాతలు రాశారు. విగ్రహాన్ని తిరిగి శుభ్రంగా మార్చి అక్టోబర్ 2వ తేదీన జరిగిన గాంధీ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. వాస్తవానికి ఫ్రెడ్డా బ్రిలియంట్‌కు 1949లోనే మహాత్మాగాంధీ విగ్రహాన్ని రూపొందించాలనే ఆలోచన వచ్చింది. అయితే, 1960ల్లో అది వాస్తవ రూపం దాల్చింది. గాంధీజీ కూర్చున్న భంగిమ, నడుస్తున్నట్లుగా, కూర్చున్నట్లుగా ఉన్న భంగిమలను ఫ్రెడ్డా ఎంచుకున్నారు.
ఇందులో సంప్రదాయబద్ధంగా, అందరి మనస్సులకూ హత్తుకుపోయేలా చిన్నదైన టావిస్టాక్ స్క్వేర్‌కు సరిపోయే చిన్న విగ్రహాన్ని రూపొందించాలని చివరిగా నిర్ణయించుకున్నారని ఈ వేలం తలపెట్టిన వూలీ అండ్ వాలిస్ సంస్థ పేర్కొంది. ఈ విగ్రహాన్ని రూపొందించడం అయ్యాక మినీయేచర్ కూడా తయారు చేయడం ఆమెకు అలవాటు. అలా మొదటిసారిగా తయారు చేసిన రెండు విగ్రహాల్లో తాజాగా వేలంపాటకు వచ్చిన విగ్రహముంది. రెండో మినియేచర్‌ను ఓ ఔత్సాహికుడు 2019లో చేపట్టిన వేలంలో 65 వేల పౌండ్లకు కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా అత్యంత గుర్తింపు పొందిన ఫ్రెడ్డా శిల్పాలలో ప్రముఖమైన కళాఖండాన్ని సొంతం చేసుకునే అరుదైన అవకాశమిదని వూలీ అండ్ వాలిస్ సంస్థ తెలిపింది.


