breaking news
Central London
-
గాంధీజీ విగ్రహం మినియేచర్
లండన్: సెంట్రల్ లండన్ స్క్వేర్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రఖ్యాత శిల్పం మినియేచర్ మోడల్ వచ్చే వారం ఇంగ్లండ్‌లో వేలానికి రానుంది. దీని ధర 6 వేల నుంచి 8 వేల పౌండ్లు, అంటే సుమారుగా రూ.6.27 లక్షల నుంచి రూ.8.36 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 27 సెంటీమీటర్ల ఎత్తుండే ఈ కాంస్య మినియేచర్ విగ్రహం, 1968లో లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని టావిస్టాక్ స్క్వేర్‌లో నెలకొల్పిన విగ్రహానికి ప్రతిరూపంగా చెబుతున్నారు. గాంధీజీ లా చదువుకున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ టావిస్టాక్ స్క్వేర్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ విగ్రహాన్ని పోలెండ్ శిల్పి ఫ్రెడ్డా బ్రిలియంట్ రూపొందించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ విగ్రహంపై కొందరు జాతి విద్వేష రాతలు రాశారు. విగ్రహాన్ని తిరిగి శుభ్రంగా మార్చి అక్టోబర్ 2వ తేదీన జరిగిన గాంధీ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. వాస్తవానికి ఫ్రెడ్డా బ్రిలియంట్కు 1949లోనే మహాత్మాగాంధీ విగ్రహాన్ని రూపొందించాలనే ఆలోచన వచ్చింది. అయితే, 1960ల్లో అది వాస్తవ రూపం దాల్చింది. గాంధీజీ కూర్చున్న భంగిమ, నడుస్తున్నట్లుగా, కూర్చున్నట్లుగా ఉన్న భంగిమలను ఫ్రెడ్డా ఎంచుకున్నారు. ఇందులో సంప్రదాయబద్ధంగా, అందరి మనస్సులకూ హత్తుకుపోయేలా చిన్నదైన టావిస్టాక్ స్క్వేర్‌కు సరిపోయే చిన్న విగ్రహాన్ని రూపొందించాలని చివరిగా నిర్ణయించుకున్నారని ఈ వేలం తలపెట్టిన వూలీ అండ్ వాలిస్ సంస్థ పేర్కొంది. ఈ విగ్రహాన్ని రూపొందించడం అయ్యాక మినీయేచర్ కూడా తయారు చేయడం ఆమెకు అలవాటు. అలా మొదటిసారిగా తయారు చేసిన రెండు విగ్రహాల్లో తాజాగా వేలంపాటకు వచ్చిన విగ్రహముంది. రెండో మినియేచర్‌ను ఓ ఔత్సాహికుడు 2019లో చేపట్టిన వేలంలో 65 వేల పౌండ్లకు కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా అత్యంత గుర్తింపు పొందిన ఫ్రెడ్డా శిల్పాలలో ప్రముఖమైన కళాఖండాన్ని సొంతం చేసుకునే అరుదైన అవకాశమిదని వూలీ అండ్ వాలిస్ సంస్థ తెలిపింది. -
లండన్‌లో కాల్పుల కలకలం!
-
లండన్‌లో కాల్పుల కలకలం!
లండన్: సెంట్రల్ లండన్‌లో శుక్రవారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఆక్స్ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్లో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తరలించి, స్టేషన్‌ను మూసేశారు. అలాగే, ముందు జాగ్రత్తగా పక్కనున్న బాండ్ స్ట్రీట్ స్టేషన్నూ మూసివేశారు. ఈ ప్రాంతానికి ఎవరూ రావద్దని, ఇప్పటికే వచ్చిన వారు రోడ్లపై తిరగకుండా, ఏవైనా భవనాల్లోకి వెళ్లిపోవాలనీ, స్థానికులు కూడా బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. మొత్తం ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ లోపే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. మరిన్ని భద్రతాబలగాలు కూడా మోహరించాయి. అయితే, తనిఖీల అనంతరం కాల్పులకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్లో కాల్పుల శబ్దం వినిపించినట్లు స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.38 గంటలకు తమకు కొందరు ఫోన్లు చేశారని పోలీసులు చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చేమోనన్న అనుమానంతో చర్యలు చేపట్టామని వివరించారు. -
‘హిందూజా’ చేతికి చారిత్రక లండన్ భవనం
లండన్: సెంట్రల్ లండన్‌లోని చారిత్రాత్మక ఓల్డ్ వార్ ఆఫీస్ భవనం లాంఛనంగా హిందూజా గ్రూప్ వశమైంది. ఇప్పటికే భవనానికి సంబంధించిన తాళాలు హిందూజా గ్రూప్ చేతికి వచ్చేశాయి. హిందూజా గ్రూప్ ఈ పురాతన భవనాన్ని 5 స్టార్ హోటల్‌గా, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్‌గా అభివృద్ధి చేయనున్నది. అలాగే ఇందులో ప్రైవేట్ ఫంక్షన్ రూమ్స్, స్పా సెంటర్స్, ఫిట్నెస్ కేంద్రాలు వంటి తదితర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నది. బ్రిటిష్ పార్లమెంట్‌కు, బ్రిటన్ ప్రధాని నివాస ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ భవనం.. 5.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 3 కిలోమీటర్ల మేర పొడవున్న ఏడు అంతస్థుల కారిడార్లు కలిగి ఉంది. హిందూజా గ్రూప్.. స్పానిష్ ఇండస్ట్రియల్ కంపెనీ ఓహెచ్‌ఎల్‌డీతో కలిసి ఈభ వనాన్ని 250 ఏళ్లకు గానూ లీజ్ పద్ధతిలో బ్రిటన్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఈ భవనంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భవన నిర్మాణం 1906లో పూర్తయ్యింది. ఇందులో 1,100 రూమ్స్ ఉన్నాయి.


