breaking news
RMR
-
ట్రాఫిక్.. గీఫిక్.. జాన్తా నై!
రూల్స్ ఉండేవే బ్రేక్ చేయడానికి అన్న వాదన నుంచి పుట్టిన సిద్ధాంతం మనది. అందుకే ఎప్పుడు రూల్స్ గురించి మాట్లాడినా.. రాద్ధాంతం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటారా.. ఇది మరీ విడ్డూరం. దేశంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న.. అందరూ కాకపోయినా ట్రాఫిక్ పోలీసుల మెప్పు పొందిన వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. రూల్స్ పాటించడమంటేనే చేతకాని తనానికి నిదర్శనమని త్రికరణశుద్ధిగా నమ్ముతుంటాం. అందుకే ఎదుటి వారికి చెప్పేటందుకే రూల్స్ ఉన్నాయి.. డోంట్ కేర్ అంటూ ఏఎన్నార్ లెక్కన పాటలు పాడుకుంటూ నిర్లక్ష్యంగా తిరిగే వారే ఎక్కువ. ఏదైన రూల్ ఉందంటే అది రాజుగారి గదిలాంటిది. రాజుగారి గదిలోకి మాత్రం వెళ్లకండి అంటే.. కచ్చితంగా అందులోకే వెళ్లడం సగటు భారతీయుని నైజం. ఇదీ అంతే.. రూల్స్ అంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ చెప్పొచ్చావులే పేద్ద.. రూల్స్ అంట రూట్స్.. అని ఆరున్నొక్క రాగాల దీర్ఘం తీయడం మనకు అలవాటై పోయింది.గీ ట్రాపిక్ పురాణం పొద్దుపొద్దులా మాకెందుకు బై అంటే.. జర ఆగుండ్రి మరి.. మన సివిక్ సెన్స్ చూసి విదేశీయులే నోరెల్ల బెడ్తుండ్రంట. పుణెలో ఓ విదేశీయుడు మనోళ్లు ఫుట్‌పాత్‌ల మీదికెళ్లి మోటార్ బైకులు చెలాయిస్తూంటే వారిని ఆపి.. ఏందిది? అని అడుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందుకే.. ఇక్కడే కాదు.. దేశంలో చాలా చోట్ల విదేశీయులు మన భారతీయుల ఉల్లం‘ఘనుల’ను చూసి.. అరే ఎంత దర్జాగా రూల్స్ వదిలేసి తిరుగుతుండ్రని నోళ్ళు నొక్కుకుంటుండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీలో సైకిల్ తిరగాల్సిన చోట వాహనాలు హల్ చల్ చేస్తుంటే.. చూస్తున్న విదేశీయులు రంగప్రవేశం చేసి జనాలకు బాబూ దీన్ని బైసైకిల్ లేన్ అంటారు. ఇక్కడ కేవలం సైకిల్స్ తిరగాలి అంతేకానీ.. ఎడాపెడా పెద్ద వాహనాలు రాకండి అంటూ నిలబడి మరీ చెప్పడం ప్రారంభించారు.కొందరు వీరి మాటలు వింటున్నట్లు నటించినా.. మరి కొందరు బేఫికర్‌గా వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అరే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ గురించి విదేశీయులు అర్థం చేసుకుని ఇలా పాటించాలి బాబూ అంటున్నా.. వినకుండా వారు అలా చెబుతున్నందుకు విసుక్కొంటున్నారట. పాపం విదేశీయులకు మన థియరీ అర్థం కాలేదు. అరే వీరేందిర బై రూల్స్ అన్నాక ఫాలో కావాలి కదా. పనిగట్టుకుని మరీ రూల్స్ బ్రేక్ చేస్తే వీరికి మాత్రం ఒరిగేదేంటి? అని లోలోపల మదనపడుతున్నారట. విదేశీయులు మన భారతీయులకు ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.🚨 A foreigner is forcing riders to move out of footpath in Pune. 🙏 pic.twitter.com/XYIqB9AzVs— Indian Tech & Infra (@IndianTechGuide) December 19, 2025మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.అరే ఇదేందిర బై వన్ వే అంటూ రాసిండు గదా.. ఇట్టే వస్తున్నవేంది? అని ఎవరైనా అడిగితే... చుట్టూ ఎలితే లంబా అవుతది గందుకే షార్ట్ గా ఈ తొవ్వలో వస్తుండ అంటూ యమ కూల్ గా సమాధానం చెబుతారు. హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు జర ఫోర్స్ చేసిండ్రు అంటే.. గదేంది సర్ పొద్దునే ఈ రూట్ లో ఇట్టే వెళ్ళా.. గప్పుడు కూడా లేదు.. ఇప్పుడు అడుగుడేంది అంటూ ఉల్టా ప్రశ్న వేస్తుంటే సదరు పోలీసు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇగ హారన్ కొట్టుడు అంటే మనకు మస్త్ మజా వస్తది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా.. హారన్ దంచుతునే ఉంటం.. అరె బై ఆ సప్పుడేంది.. ట్రాఫిక్ ఉంది కదా అని విసుక్కొన్నారో.. హారన్ సౌండ్ మరింత పెరుగుతుంది. అదే విదేశాల్లో హారన్ కొట్టడం అంటే న్యూసెన్స్ గా భావిస్తారు.విదేశాల్లో ఇలా అంటే చాలు ఆ మా బాగా చెప్పొచ్చావులే.. అక్కడికే వెళ్ళలేకపోయావా అంటూ వ్యంగ్యం దట్టించి మరీ మాటలు వదులుతుంటారు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే.. యూరోపియన్ దేశాల్లో అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పట్టింపు చాలా ఎక్కువ. రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు సైకిల్ పై వెళ్లే వారికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. ప్రభుత్వ బస్సులు నడపడానికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. పాదచారులకు వారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. పెడస్ట్రియన్ సిగ్నల్ పడిందంటే.. ఎన్ని వాహనాలైనా సరే అటూ ఇటూ నిలిచి వేచి చూడాల్సిందే. అలాగే స్కూల్ జోన్ వద్ద సైలంట్ జోన్ అని ఉంటుంది. అక్కడ హారన్ మోగిస్తే ఫైన్ కట్టాలి. అలాగే స్కూల్, హాస్పిటల్ వద్ద స్పీడుగా వెళ్ళినా పెనాల్టీ డబుల్ ఉంటుంది. టొరంటోలో ట్రాఫిక్ ఎప్పుడూ హెవీగానే ఉంటుంది. కానీ ప్రమాదాల శాతం చాలా తక్కువ. మనకూ ట్రాఫిక్ రూల్స్ బోలెడన్ని ఉన్నాయ్.. పాటించేవారి సంఖ్యే తక్కువ. రూల్స్ బ్రేక్ చేయడమంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. అది తప్పని కూడా అనుకోం. పాపం ఢిల్లీలో విదేశీయులు మన అరాచకం చూసి అల్లాడిపోయారు. కనీసం రూల్స్ చెబితే పాటిస్తారేమోనని అనుకుని చెప్పడం ప్రారంభించారు. వారిది ఎంత దురాశో కదా.-ఆరెం. -
బాబూగోరిజం అంటే ఇదే మరి...
ఇజాలు నిజాలు వేర్వేరు...ఇజం నిజం కానక్కర్లేదు...నిజానికి ఇజం అక్కర్లేదు..ఇదే మన ముఖ్యమంత్రి బాబుగారి సిద్ధాంతమేమో అనిపిస్తోంది. చెప్పొచ్చేదేంటంటే...సర్కారు సంక్షేమ కాడిని కిందికి పడేసి...ప్రైవేటు భుజాన పెట్టేయడమే వారి దృష్టిలో అసలు సిసలు సంస్కరణ. మీకు డౌటనుమానమా? అయితే ఏపీలో కాస్త లుక్కేయండి...బాబుగోరు పవర్ లోకి వచ్చాక ఎన్ని విప్లవాలు పుట్టుకొచ్చాయో....వైద్యవిద్యను దెబ్బకు ప్రైవేటు పరం కానిచ్చి పరమానందంగా అలా ముందుకెళదాం అంటున్నారు. కావచ్చు మనకేంటి నష్టం? అంటారా? ప్రజలకు ప్రాథమిక హక్కుగా అందాల్సిన వైద్యం పక్కా కమర్షియల్ గా మారిపోవడానికి ....ఆ వైద్యవిద్యపై కొందరు ఖర్చుపెట్టే లక్షలాది ఫీజులు కాదా. ఇలా ప్రతీది ప్రైవేటు అంటూ పోతే సర్కారుకు బరువు బాధ్యతలు పేలపిండిలెక్కన మారిపోవా? అని కొందరు బాధపడుతున్నారు. .అసలు బాబుగోరి రూటే వేరండి...మనకు అర్థం చేసుకునే బుర్ర ఉండాలి. వారిది మొదట్నుంచీ ఇదే స్టైల్. కాశీకి పోయి ఏదో ఒకటి వదిలేసేవారున్నట్లే...సర్కారు వచ్చాక దేన్నైనా ప్రైవేటు భుజాలపై పెట్టి వదిలించుకునే అలవాటున్నవారు మరి. అందుకే ఈసారి మెడికల్ కాలేజీ పై పడ్డారు. అన్నిటికీ మించి గత సర్కారు చేసిన ఏ మంచి పనినైనా సరే కెలకాల్సిన గొప్ప బాధ్యత అధికారంలోకి వచ్చాక ఉంటుంది కదా అనుకుంటున్నారేమో తెలీదు కానీ ...వైఎస్సార్ సీపీ అధికాంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవాలన్న అంశాన్ని ఇపుడు ప్రైవేటు వారికిచ్చేశారు. గతంలో మహారాజులు నచ్చిన వారికి అగ్రహారాలు రాసిచ్చినట్లు ఇపుడు ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసేందుకు రెడీ అయిపోయారు. మరోపక్క విశాక స్టీల్ ప్రైవేటుపరం చేసే కుంపటి రగులుతునే ఉంది..సీట్లు తక్కువొచ్చాయి కదా జగన్ పార్టీ ఏం చేస్తుందిలే అనుకుంటే...అంతకంతకూ పవర్ ఫుల్ గా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఇపుడు కో టి గళాల గర్జన అంటూ జగన్ మరో అంకానికి తెరలేపడంతో కూటమి అధినేత బాబుగారు జర గుస్సాఅవుతున్నారని వినికిడి. గత రెండు నెలలుగా వైఎస్పార్ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో కోటి సంతకాల సేకరణోద్యమం ఉధృతంగా సాగుతున్నది బాబుగారి దాకా చేరక పోతుందా? వారు కినుక వహించకుండా పోతారా? అన్నది కదా పాయింట్..గత వైఎస్సార్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్ది బడుగు పిల్లల నోట ఇంగ్లీష్ మాటలు పలికించిన తీరు ఎంతకాదన్నా కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇబ్బందిగానే మారింది. ప్రైవేటు పాఠశాలల ఊసెత్తని తరం వచ్చేస్తోందన్న ఆందోళన అప్పట్లో వారిలో ఎంతుండేదని. కూటమి రాగానే హమ్మయ్యా మనకిక భయంలేదు...సర్కారు పాఠశాలలకు మళ్ళీ నిరాదరణ వైభోగం తప్పదనుకున్నారని సమాచారం. ఇపుడు మరి బాబుగారికి ఆలోచన ఏ బ్రహ్మీ ముహూర్తాన పుట్టిందో తెలీదు కానీ గత వైఎస్సార్ సీపీ సర్కారు హయంలో ఏర్పడ్డ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించుకున్నారు. .ఇది మున్ముందు సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బందిగా మారుతుంది. వైద్యం బడుగు ప్రజలకు అందుబాటులోకి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుంది...ఇవేవీ ఇపుడు వారి సిలబస్ లో లేని అంశాలు. అయినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ...ఆ వారసత్వ బాటలో నడచిన తనయుడు మాజీసీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సర్కారు విద్య సంస్కరణలు ప్రజలకు గుర్తుండే ఉంటుందిగా. మరీ ముఖ్యంగా ఇలా ప్రైవేటు పడగ విప్పినపుడు ఇంకా బాగా గుర్తొస్తుంటుంది. - ఆరేం. -
అటు నేనే...ఇటు నేనే..!
అటు నేనే ...ఇటు నేనే....అది నేనే....ఇది నేనే...అంతా మాయ...అన్నట్టుంది ఏపీ డీసీఎం పవన్ సారు తీరు. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అన్నట్లు పవన్ జీ తానొవ్వక...కమలదళాధిపతుల మనసు నొప్పించక వారిని ఎలాగైనా ఒప్పించేందు నిరంతరం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాషాయాలింగనం చేసుకున్న దరిమిలా ఇపుడు జనసేనాని హిందుత్వానికి అపర ధర్మకర్తలా వ్యవహరిస్తూ మోదీ మనసు చూరగొంటున్నారు. ఇటు బాబు...అటు మోదీ ఇరుగడలా చూస్తుండగా...మన పవన్ సార్ అరివీర భయంకరుడిలా...అపర హిందుత్వ వాదిలా సందర్భం దొరికినపుడల్లా వీర విజృంభణ చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉడిపి శ్రీకృష్షుడి చెంతన నిలిచి పసితనంలోనే తాను తన కుటుంబ సభ్యులు నారాయణ నారాయణ అని జపించి తరించినట్లు ఉటంకించుకున్నారు. .అదేంటి సార్ అప్పుడెప్పుడో నాన్నగారు పరమనాస్తికులు అమ్మ ఇచ్చే హారతి వెలుగులోనే నాన్నగారు చుట్టా కాల్చేవారని అన్నారు కదా అంటే నిజమే అదినేనే...ఇది నేనే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఎవరేం అంటారు. అంతేలేండి ఎవరి అభిరుచి వారిది కాదనలేం. కానీ తవరి అభిరుచులు మారిపోతున్నాయి కదా అంటారా? సో వాట్ మారకూడదా అని పవన్ సారు అన్నప్పుడు నిజమే అని బేషరతుగా ఒప్పేసుకోవడమే మంచిదంటున్నారు మరికొందరు. తాజాగా హిందూ విశ్వాసాలను , ఆచారాలను పాటించడg రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు అని ఓ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినందుకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో అభిశంసనకు పిలుపునివ్వడాన్ని ఏమనాలి? ఇది కోర్టుల్ని మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? సూడో సెక్యూలరిజం కాదా అని డీసీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తూ ఎక్స్ లో ట్వీటారు. సరే ఎవరైనా సరే ఒక ధర్మ గురించి అభిప్రాయం వ్యక్తం చేయడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. అది వారి వ్యక్తీకరణ స్వేచ్ఛ. అయితే వచ్చిన చిక్కంతా ఏంటంటే...మనం గతంలో ఒకలా వ్యవహరించి అకస్మాత్తుగా విధానాలను మార్చుకుని ఏమీ జరగనట్లు వ్యవహరిస్తున్నప్పుడే కొన్ని విమర్శలు ఎదురవుతాయి. వాటికి స్పందించడమా లేదా అన్నది మళ్ళీ వ్యక్తిగతం అవుతుంది..తమిళనాడులోని తిరుప్పర కుండ్రం కొండపైన దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించే విషయంగా అక్కడి దర్గా కమిటీకి.... సుబ్రమణ్య స్వామి ఆలయ కమిటీకి మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించి మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ పరిమిత సంఖ్యలో వెళ్ళి దీపం వెలిగించవచ్చంటూ ఆదేశిలివ్వడంపై ఇండియా కూటమి ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసి న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. ఈ విషయంగా మితవాదులు, వామపక్షవాదులు వారి స్పందనలు తెలపడంలో ఎలాంటి వింత ఉండదు. కానీ గతంలో వామభావాలతో కాగి ఊగి రేగి పోయిన నేత ఉన్నట్టుండి కాసాయాంబర ధారిగా మారి మాట్లాడ్డమే కాసింత చోద్యం అనిపిస్తోంది..2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీఎస్పీ , వామపక్షాలతో జట్టు కట్టారు. అప్పట్లో తను పోటీ చేసిన రెండు సీట్లలో ఒటమి పాలైన విషయం తెలిసిందే. 137 సీట్లకు గాను కేవలం ఒక్కసీటే జనసేన ఖాతాలో వేసుకోగలిగింది. 2014...2019 జనసేనాని పవన్ కల్యాణ్ తన రాజకీయ పంథా వామపక్షభావాలతో ముడిపడి ఉండేవే అన్నట్టు వ్యవహరించేవారు. చెగువేరా వీరాభిమానిగా సగర్వంగా ప్రకటించుకున్నారు కూడా. అప్పటి ఎన్నికల ప్రచార వాహనాలకు చెగువీరా బొమ్మలుండేవి. క్యూబన్ విప్లవవాది ఫిడేల్ కాస్ట్రో , బెంగాల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడు చారు మజుందార్ తన స్పూర్తిప్రదాతలుగా తెలిపారు. ఇదంతా గతం గత:. ప్రస్తుతం జనసేన అధినేత, డీసీఎం పవన్ కల్యాణ్ హిందుత్వవాదిగా కనిపిస్తూ ఆ సెగ్మెంట్ లో కొత్త ఓటుబ్యాంకుకు ప్రయత్నిస్తున్నారని కొందరి వాదన..మార్క్సిస్ట్ విప్లవవాది చెగువేరా రోల్ మోడల్ గా గుండెలో నిలుపుకొన్న పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఎలా హార్డ్ కోర్ హిందుత్వ వాదిగా పరివర్తనం చెందారన్నదే చాలా మందికి మింగుడుపడని ప్రశ్న. - ఆరెం


