అటు నేనే ...ఇటు నేనే....అది నేనే....ఇది నేనే...అంతా మాయ...అన్నట్టుంది ఏపీ డీసీఎం పవన్ సారు తీరు. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అన్నట్లు పవన్ జీ తానొవ్వక...కమలదళాధిపతుల మనసు నొప్పించక వారిని ఎలాగైనా ఒప్పించేందు నిరంతరం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాషాయాలింగనం చేసుకున్న దరిమిలా ఇపుడు జనసేనాని హిందుత్వానికి అపర ధర్మకర్తలా వ్యవహరిస్తూ మోదీ మనసు చూరగొంటున్నారు. ఇటు బాబు...అటు మోదీ ఇరుగడలా చూస్తుండగా...మన పవన్ సార్ అరివీర భయంకరుడిలా...అపర హిందుత్వ వాదిలా సందర్భం దొరికినపుడల్లా వీర విజృంభణ చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉడిపి శ్రీకృష్షుడి చెంతన నిలిచి పసితనంలోనే తాను తన కుటుంబ సభ్యులు నారాయణ నారాయణ అని జపించి తరించినట్లు ఉటంకించుకున్నారు.
.
అదేంటి సార్ అప్పుడెప్పుడో నాన్నగారు పరమనాస్తికులు అమ్మ ఇచ్చే హారతి వెలుగులోనే నాన్నగారు చుట్టా కాల్చేవారని అన్నారు కదా అంటే నిజమే అదినేనే...ఇది నేనే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఎవరేం అంటారు. అంతేలేండి ఎవరి అభిరుచి వారిది కాదనలేం. కానీ తవరి అభిరుచులు మారిపోతున్నాయి కదా అంటారా? సో వాట్ మారకూడదా అని పవన్ సారు అన్నప్పుడు నిజమే అని బేషరతుగా ఒప్పేసుకోవడమే మంచిదంటున్నారు మరికొందరు.
తాజాగా హిందూ విశ్వాసాలను , ఆచారాలను పాటించడg రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు అని ఓ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినందుకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో అభిశంసనకు పిలుపునివ్వడాన్ని ఏమనాలి? ఇది కోర్టుల్ని మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? సూడో సెక్యూలరిజం కాదా అని డీసీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తూ ఎక్స్ లో ట్వీటారు. సరే ఎవరైనా సరే ఒక ధర్మ గురించి అభిప్రాయం వ్యక్తం చేయడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. అది వారి వ్యక్తీకరణ స్వేచ్ఛ. అయితే వచ్చిన చిక్కంతా ఏంటంటే...మనం గతంలో ఒకలా వ్యవహరించి అకస్మాత్తుగా విధానాలను మార్చుకుని ఏమీ జరగనట్లు వ్యవహరిస్తున్నప్పుడే కొన్ని విమర్శలు ఎదురవుతాయి. వాటికి స్పందించడమా లేదా అన్నది మళ్ళీ వ్యక్తిగతం అవుతుంది.
.
తమిళనాడులోని తిరుప్పర కుండ్రం కొండపైన దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించే విషయంగా అక్కడి దర్గా కమిటీకి.... సుబ్రమణ్య స్వామి ఆలయ కమిటీకి మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించి మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ పరిమిత సంఖ్యలో వెళ్ళి దీపం వెలిగించవచ్చంటూ ఆదేశిలివ్వడంపై ఇండియా కూటమి ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసి న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. ఈ విషయంగా మితవాదులు, వామపక్షవాదులు వారి స్పందనలు తెలపడంలో ఎలాంటి వింత ఉండదు. కానీ గతంలో వామభావాలతో కాగి ఊగి రేగి పోయిన నేత ఉన్నట్టుండి కాసాయాంబర ధారిగా మారి మాట్లాడ్డమే కాసింత చోద్యం అనిపిస్తోంది.
.
2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీఎస్పీ , వామపక్షాలతో జట్టు కట్టారు. అప్పట్లో తను పోటీ చేసిన రెండు సీట్లలో ఒటమి పాలైన విషయం తెలిసిందే. 137 సీట్లకు గాను కేవలం ఒక్కసీటే జనసేన ఖాతాలో వేసుకోగలిగింది. 2014...2019 జనసేనాని పవన్ కల్యాణ్ తన రాజకీయ పంథా వామపక్షభావాలతో ముడిపడి ఉండేవే అన్నట్టు వ్యవహరించేవారు. చెగువేరా వీరాభిమానిగా సగర్వంగా ప్రకటించుకున్నారు కూడా. అప్పటి ఎన్నికల ప్రచార వాహనాలకు చెగువీరా బొమ్మలుండేవి. క్యూబన్ విప్లవవాది ఫిడేల్ కాస్ట్రో , బెంగాల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడు చారు మజుందార్ తన స్పూర్తిప్రదాతలుగా తెలిపారు. ఇదంతా గతం గత:. ప్రస్తుతం జనసేన అధినేత, డీసీఎం పవన్ కల్యాణ్ హిందుత్వవాదిగా కనిపిస్తూ ఆ సెగ్మెంట్ లో కొత్త ఓటుబ్యాంకుకు ప్రయత్నిస్తున్నారని కొందరి వాదన.
.
మార్క్సిస్ట్ విప్లవవాది చెగువేరా రోల్ మోడల్ గా గుండెలో నిలుపుకొన్న పవన్ కల్యాణ్ ఉన్నట్టుండి ఎలా హార్డ్ కోర్ హిందుత్వ వాదిగా పరివర్తనం చెందారన్నదే చాలా మందికి మింగుడుపడని ప్రశ్న.
- ఆరెం


