మాచవరం: అధికారం కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. తమకు మెజార్టీ లేకున్నా మాచవరం ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. టీడీపీ నాయకుల అరాచకాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల బంధువులను దాచేపల్లి సీఐ స్టేషన్‌కు పిలిపించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మాచవరం మండల పరిషత్ అధ్యక్షురాలు దారం అమ్ములమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 11న ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.
ఈ క్రమంలో మెజారిటీ లేకున్నా టీడీపీ నేతలు ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు స్థానాలు ఉన్నాయి. వాటిలో 13 స్థానాలు వైఎస్సార్ సీపీ దక్కించుకోగా, టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇటీవల జరిగిన పరిణామాలలో వేమవరం ఎంపీటీసీ శానంపూడి లక్ష్మి, కొత్త గణేశునిపాడు ఎంపీటీసీ చల్లగుండ్ల లక్ష్మయ్య పార్టీ ఫిరాయించారు. దీంతో ఫిరాయింపుదారులతో కలిపి టీడీపీ బలం నాలుగుకు చేరింది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీకి 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. దీంతో గెలుపు అసాధ్యమని గుర్తించిన టీడీపీ నాయకులు వక్ర మార్గాలను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికపై మండల ప్రజానీకంలో ఉత్కంఠ నెలకొంది. న్యాయమే గెలుస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొంటున్నారు.
పోలీసుల అండదండలు
మండలంలోని చెన్నాయపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు సపోర్ట్ లక్ష్మీబాయికి బావ వరుసైన బాలు నాయక్, మల్లవోలు ఎంపీటీసీ సభ్యురాలు చుక్క సువార్త కుమారుడు పెదరాజారావులను దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ మంగళవారం ఉదయం అక్రమంగా పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారంటూ బంధువులు ఆరోపించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన వైఎస్సార్ సీపీ శ్రేణులు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని ఆశ్రయించారు. పోలీసుల తీరును మండల ప్రజలు తప్పుబడుతున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
మాచవరం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక గురువారం జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలంటూ గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు న్యాయం చేస్తుందని కాసు పేర్కొన్నారు.


