తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. బాధితురాలు స్వరాష్ట్రం ఒడిశాకు తిరుపతి పోలీసుల బృందం మంగళవారం చేరుకుంది. ఒడిశా జార్హ్‌పూర్‌లో బాధితురాలిని మహిళా ఎస్‌ఐ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి వివరాలను సేకరించారు. యువతి స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డ్ చేసి భద్రపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంపై తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ వేదికగా ప్రస్తావించడంతో ఇటు పోలీసులు, అటు వర్సిటీ అధికారులలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.
అధ్యాపకుడు లక్ష్మణ్ కుమార్ తనను పలు మార్లు లైంగికంగా వేధించారని, మరో అధ్యాపకుడు శేఖర్‌రెడ్డితో ఏకాంతంగా గడిపిన వీడియోలు ఉన్నాయంటూ లక్ష్మణ్ కుమార్ పలుమార్లు బెదిరింపులకు దిగారని బాధితురాలు తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ స్టేట్‌మెంట్‌లను ఆధారం చేసుకొని, పోలీసులు ఆ ఇద్దరి అధ్యాపకులను అరెస్ట్ చేశారు. అనంతరం ఈస్ట్ పోలీసులు స్థానిక డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం అధ్యాపకులకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది.


