కంటి తుడుపుగా ప్రభుత్వ సాయం
వరదయ్యపాళెం (కేవీబీపురం): కేవీబీపురం మండలంలోని కళత్తూరు దళితవాడలోని ముంపు బాధితులకు ప్రభుత్వం కంటి తుడుపు సాయం అందించింది. ఆ మేరకు మంగళవారం కళత్తూరు దళితవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ శంకర్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపునకు గురై నష్టం సంభవించిన ఒక్కో కుటుంబానికి రూ. 10వేలు చొప్పున 420 కుటుంబాలకు రూ. 42లక్షల ఆర్థికసాయాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ.1,20,65,600 మెగా చెక్కును బాధిత ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళత్తూరు గ్రామంలో జరిగిన ఘోర విపత్తు కారణంగా ప్రభుత్వం నుంచి తక్షణమే సహాయక చర్యలు అందజేశామన్నారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవికుమార్, తహసీల్దార్ రోశయ్య, ఎంపీడీఓ మాలతి, నాయకులు రామాంజుల నాయుడు, గోపినాథ్ రెడ్డి, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.
పరిహారంపై ప్రజలు అసంతృప్తి
ముంపు కారణంగా కళత్తూరులో జరిగిన కొండంత నష్టానికి గోరంత సాయంతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని స్థానిక బాధిత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి తక్కువ పక్షంలో రూ. 50 వేలు నుంచి రూ. లక్షకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. ఇంత నష్టం జరిగితే ఒక్కో ఇంటికి రూ. 10వేల సాయంతో కంటి తుడుపు చర్యలతో మమ అనిపించారని స్థానిక ప్రజలు గుసగుసలాడారు.


