- సీమజిల్లాల్లో సరికొత్త వ్యవసాయం
రాయలసీమలోని అనంతపురం అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేసి కరువు.. ఎండలు.. ఎడారీకరణ జరుగుతున్న పల్లెలు.. అక్కడక్కడా కనిపించే గుళ్ళు గోపురాలు.. కొండల మాటున అక్కడప్పడా సాగయ్యే వేరుశెనగ... బెంగళూరుకు వలస వెళ్లే కూలీలు.. చలికాలంలో కూడా భగ్గున మండే ఎండలు.. ఇదంతా అనంతపురం సొంతం.. దాని బ్రాండ్.. కానీ ఇప్పుడు అనంతపురం తన రూటు మార్చుకుంటోంది. ఎక్కడో ఎముకలు కొరికే చలిలో .. మంచుకురిసే ప్రాంతాల్లో పాండే యాపిల్స్ ఇప్పుడు అనంతపురం జిల్లాల్లో పండుతున్నాయి. అదేంటి.. మంచుకురిసే ప్రాంతాల్లో పండాల్సిన యాపిల్స్ నిప్పులు కురిసే అనంతపురంలో పండుతున్నాయి.. కాలం మారింది..
అనంతపురం వాతావరణం అంటే దక్షిణభారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనది. ఇది భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం గల ప్రాంతం. దారుణమైన నీటి కొరతను ఎదుర్కొనే వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటి. ఈ జిల్లాలో 90% కంటే ఎక్కువ భూములు .. రైతులు వాననీటిపై ఆధారపడి సేద్యం చేస్తున్నారు. ఇక్కడ వర్షం తక్కువ.. బావులు.. బోర్లు.. కాలువలు కూడా మృగ్యమే. దీంతో ఇక్కడ అంతటి వర్షాభావ పరిస్థితుల్లో మనగలిగే పత్తి, మామిడి, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మారాయి. హార్టికల్చర్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ద్రాక్ష, యాపిల్ వంటి పళ్ళను సైతం పండేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
ఇందులో భాగంగా రైతులు, పరిశోధకులు ఏమాత్రం తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా మనగలిగే యాపిల్ రకాలను అన్వేషిస్తున్నారు. ఇవి వేడి వాతావరణంలో కూడా పెరగగలవు. అయితే వీటికి సాగునీరు అందించాల్సి ఉంటుంది. దీంతోబాటు డ్రిప్ ద్వారా నీరు అందిస్తే యాపిల్ మరింత ఆరోగ్యకరంగా పెరుగుతుంది. ప్రయోగాత్మకంగా ఇక్కడ యాపిల్స్ పంట సక్సెస్ కావడంతో ఇక ఇక్కడ మున్ముందు మరింతగా దీని సాగు పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఒక మొక్క అద్భుతంగా కాపునివ్వడంతో శాస్త్రవేత్తలు, రైతుల్లో సంతోషం మిన్నంటింది. మున్ముందు ఇక్కడ కూడా యాపిల్ సాగు సాధ్యమే అనే విశ్వాసం పెంపొందింది. దీంతో ఈ యాపిల్ సాగుపై అధికారులు, రైతుల్లో అసలు పెరిగి.. ఈ దిశగా కృషి మొదలైంది.
విశాఖ మన్యంలోనూ యాపిల్ సాగు..
అనంతపురంలోనే కాకుండా అల్లూరి జిల్లా చింతపల్లి జీకే వీధి మండలాల్లో యాపిల్ సాగు మంచి ఫలితాలను ఇస్తోంది. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉండే చింతపల్లి జీకేవీధి, పాడేరు, అరకులోయల్లోని ఏజెన్సీ ప్రాంతాలు యాపిల్ సాగుకు అనువైన ప్రాంతంగా నిలుస్తున్నాయి. దీంతోబాటు ఆంధ్రప్రదేశ్ కాశ్మీరుగా చెప్పే లంబసింగిలో యాపిల్ సాగుకు అనుకూలం అని తేలింది. దీంతో ఐదేళ్ల క్రితం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో యాపిల్ సాగు మొదలవగా నేడు అవి మంచి ఫలితాలను ఇస్తున్నది.
ఇక రెండు వెరైటీల యాపిల్ చెట్లు ఇక్కడ పెరిగాయని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఇక్కడ పండుతున్న ఒక్కో యాపిల్ బరువు 300 - 400 గ్రాములు ఉన్నట్లు తేలింది. విశాఖ ఏజెన్సీలోని దమనపల్లి పంచాయతీ కింద ఉన్న మడెం అనే గిరిజన గ్రామంలో యాపిల్ తోటను పెంచారు. ఒక్కో చెట్టుకు 30 నుంచి 34 యాపిల్ పండ్లు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం పాడేరు ఐటీడీఏలో అధికారులు యాపిల్ మొక్కలను కొంతమంది రైతులకు అందజేసి యాపిల్ పెంపకాన్ని ప్రోత్సహించారు. ఇవి మంచి ఫలితాలను ఇచ్చినట్లు అక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాపిల్ సాగు విశాఖ ఏజెన్సీలోని మండలాల్లో 60 నుంచి 70 ఎకరాల్లో సాగులో ఉంది. దీన్ని కనీసం 200 ఎకరాలకు విస్తరించాలన్నది అధికారుల ప్లాన్. మొత్తానికి ఏపీ ఇప్పుడు ఒక యాపిల్స్ అడ్డాగా మారింది.
-సిమ్మాదిరప్పన్న


