సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను చట్టవిరుద్ధం అని పిలవ లేమని, పెళ్లి లేకుండా కలిసి జీవించడం నేరం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ప్రకారం ప్రతి పౌరుడిని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని, ఒక జంట అవివాహిత హోదా వారి ప్రాథమిక హక్కులను అడ్డుకోకూడదని కూడా స్పష్టం చేసింది. సహజీవనం చేస్తున్న 12 జంటలు తమకు రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
లివ్-ఇన్ సంబంధాలను 'చట్టవిరుద్ధం' అని పిలవలేమని, ఈ భావన అందరికీ ఆమోదయోగ్యం కాదు కాబట్టి, వివాహం కానంత మాత్రాన కలిసి జీవించడం జీవించడం నేరమని చెప్పలేమని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. ఎవరైనా వారి ప్రశాంతమైన జీవనానికి అంతరాయం కలిగిస్తే ఈ మహిళలకు తక్షణ రక్షణ కల్పించాలని కోర్టు సంబంధిత జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. పౌరుడు మైనర్ లేదా మేజర్, వివాహిత లేదా అవివాహిత అనే తేడా లేకుండా భారత రాజ్యాంగంలోని పౌరులుగా ప్రాథమిక జీవించే హక్కును ఉన్నతమైందిగా పరిగణించాలని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు.
పిటిషనర్లు సంబంధిత జిల్లాల్లో పోలీసులను సంప్రదించారని, కానీ తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మొత్తం 12 రిట్ పిటిషన్లలో వివాదం ఒకేలా ఉన్నందున, వాటిని ఉమ్మడి తీర్పు ద్వారా నిర్ణయిస్తున్నామని కోర్టు పేర్కొంది. కేసు వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, పిటిషనర్లు శాంతియుతంగా కలిసి జీవించే స్వేచ్ఛ ఉంటుందని, వారి ప్రశాంతమైన జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అభిప్రాయపడింది. పిటిషనర్లు విద్యావంతులైతే, చట్టప్రకారం ఆమోదయోగ్యమైన విద్యా, ఇతర ధృవపత్రాలను సమర్పించినట్లయితే, వారు మేజర్లు అయితే, ఏ పోలీసు అధికారి కూడా వారిపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోకూడదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి: బెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్!


