ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ చాలా తగ్గిపోయింది. రేపటి వరకు తీవ్రస్థాయిలో పొగమంచు కొనసాగుతుందని ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఉత్తరాఖండ్‌లపై కూడా దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, త్రిపురలో రేపటి వరకు కూడా పొగమంచు కప్పేస్తుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.
కాగా, పొగమంచు కారణంగా ఢిల్లీలో వాహనాలూ కనిపించని పరిస్థితి ఎదురవుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో రాజధానిని పొగమంచు కప్పేసినట్లు ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. జాతీయ రాజధానిలో సగటు గాలి నాణ్యత సూచిక (AQI) ఇవాళ ఉదయం 7 గంటలకు 387గా నమోదైంది. నిన్న (గురువారం) వాయు నాణ్యత (AQI) 373గా నమోదైంది. ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు కారణంగా 27 విమానాలు రద్దు కాగా.. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
కాగా, ఢిల్లీ ప్రభుత్వం పలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది. గ్రాప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ- ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో నిర్వహణ, మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల వాహనాలు మినహా ఢిల్లీలోకి డీజిల్ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు. గడువు ముగిసిన వాహనాలపై నిషేధం అమలు చేస్తున్నారు. ఢిల్లీ పొల్యూషన్ నేపథ్యంలో 5వ తరగతి వరకు ఆన్‌లైన్లలో మాత్రమే తరగతులు నిర్వహించాలని.. 6 నుంచి 12వ తరగతి వరకు హైబ్రిడ్ విధానంలో క్లాసులు చేపట్టాలని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది.


