సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్పెషల్ ఐబీ మాజీ చీఫ్, ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుకు మరో షాక్ తగిలింది. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని మరోసారి స్పష్టం చేస్తూ.. ఆయన కస్టడీని వారం పొడిగిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావుకు సంబంధించిన కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఇవాళ కోర్టుకు సమర్పించింది. ‘‘ప్రభాకర్‌రావు కీలక విషయాలు దాటవేస్తున్నారు. విచారణకు ఏమాత్రం సహకరించలేదు’’ అని తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో.. ఆయన్ని మరికొన్ని రోజులు విచారణ జరపాల్సి ఉందని. కస్టడీ పొడిగించాలని మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా విజ్ఞప్తి చేశారు.
పోలీస్ కస్టడీలో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. డివైజ్‌లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. మరో వారం రోజుల పోలీస్ కస్టడీ అవసరం. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్‌లను ట్యాప్ చేశారు. జడ్జిలు, డ్రైవర్ల ఫోన్‌లను సైతం ట్యాప్ చేశారు. ఇది రాజకీయ సమస్య కాదు. వ్యక్తిగత గోప్యత కు సంబంధించిన అంశం. ప్రభుత్వ పెద్దలు.. ఎవరినైనా కాల్చమని చెబితే కాలుస్తారా?.. ప్రభాకర్ రావు అనేక సాక్షాధారాలను ధ్వంసం చేశారు.. అని తుషార్ మెహతా, సిద్ధార్థ్ లూత్రా వాదించారు.
ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘విచారణ పేరుతో ప్రభాకరరావును వేధిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఏకకాలంలో విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు 69 ఏళ్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు. కనీసం మానవత్వం చూపించడం లేదు. తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చేలా వేధిస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21 ఉల్లంఘించడమే. 17 సార్లు పిలిచి దాదాపు 96 గంటలకు పైగా విచారించారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే తెలంగాణ పోలీసుల తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం .. ఆయన కస్టడీని మరో వారం రోజులు(డిసెంబర్ 25 దాకా) పొడిగించింది. ఆ మరుసటిరోజు ఆయన్ని విడుదల చేయాలని సిట్‌ను ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణ దాకా ప్రభాకర్‌రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు (అరెస్ట్.. థర్డ్ డిగ్రీలాంటి చర్యలు) తీసుకోవద్దని సిట్‌కు స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే.. ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూనే అరెస్ట్ నుంచి ఇంతకాలం ఊరటగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు డిసెంబర్ 11వ తేదీన ఎత్తేసింది. ఆయన్ని తక్షణమే సిట్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వారంపాటు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని.. ఆ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడని.. విచారణ వివరాలను తమకు నివేదిక రూపంలో సమర్పించాలని కోర్టు ఆ సమయంలో సిట్‌కు సూచించింది.

వారం రోజుల కస్టడీ విచారణ ముగియడంతో శుక్రవారం ఆ నివేదికను కోర్టుకు అందించింది. అయితే విచారణలో ఆధారాలు ముందుంచి ప్రశ్నించినా కూడా.. ఆయన నోరు మెదపలేదని తెలుస్తోంది. ప్రభాకర్‌రావుకు సంబంధించి ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లలోని ఐక్లౌడ్, జీమెయిల్ అకౌంట్లలోని సమాచారాన్ని సిట్ కీలకంగా భావిస్తోంది. కానీ, అప్పటికే ఆయన ఆ సమాచారం అంతా డిలీట్ చేశారు. దీంతో ఫోరెన్సిక్ నివేదిక మీద సిట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు.. వారం కస్టడీ పొడిగింపుతోనైనా ఆయన్నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.


