మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి..
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
బంజారాహిల్స్: జుట్టు రాలుతుందని క్లినిక్‌కు వెళితే తనకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెటారంటూ ఓ బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. హఫీజ్‌బాబానగర్‌లో నివసించే అప్జల్ తౌఫీక్ అహ్మద్ (45) జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నాడు. తెలిసిన వారి ద్వారా కస్టమర్ కేర్ నెంబర్ తీసుకుని వారిని సంప్రదించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లో ఉన్న రాయన్ క్లినిక్‌కు రావాలని వారు సూచించారు.
తమ క్లినిక్ ను.. ఉత్తమ టర్కీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌గా వారు చెప్పుకొచ్చారు. దీనిని నమ్మిన అప్జల్ తౌఫీక్ సదరు క్లినిక్‌కు వెళ్లి రిసెప్షన్‌లో ఉన్న మమత అనే మహిళతో తన సమస్య గురించి వివరించాడు. మీ సమస్య పరిష్కారానికి పీఆర్‌పీ హెయిర్ ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉంటుందని, అందుకోసం నెలకు రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, అలా ఆరు నెలల పాటు చికిత్స చేయించుకోవాలని సూచించింది. దీనికి అంగీకరించిన అతనికి అదే రోజు ప్రవీణ్ అనే ల్యాబ్ టెక్నీషియన్ చికిత్స ప్రారంభించారు.
చికిత్స చేసే సమయంలో అతనికి తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆ విషయాన్ని వారికి తెలియజేయగా, ఏమీ కాదని చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. అయితే అప్పటినుంచి అప్జల్ తౌఫీక్‌కు తలనొప్పి తగ్గకపోగా వాంతులు, చేతులు మొద్దుబారడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. నకిలీ డాక్టర్, క్లినిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయని పేర్కొంటూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


