సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (టీఎస్‌డీఆర్‌సీ) అధ్యక్షురాలిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గురజాల రాధారాణి నియమితులయ్యారు. ఈ మేరకు పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ జైశ్వాల్ పదవీ విరమణ చేసిన 22 నెలల తర్వాత కీలకమైన ఈ పోస్టు భర్తీ కావడం గమనార్హం. హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జస్టిస్ రాధారాణి గత జూన్ 26న పదవీ విరమణ పొందిన విష యం తెలిసిందే. అధ్యక్ష పదవికి సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సులను హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆమోదించి ప్రభుత్వానికి పంపగా తాజాగా ఉత్తర్వులిచ్చింది.
67 ఏళ్ల వయసు వరకు ఆమె ఈ పోస్టులో కొనసాగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో 1963, జూన్ 29న రాధారాణి జని్మంచారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టభద్రురాలై.. ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. అనంతరం దేశంలో ఫోరెన్సిక్, దర్యాప్తు విభాగాల పనివిధానాలపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. కొద్దికాలం న్యాయవాదిగా విజయవాడ, ఏలూరు, హైదరాబాద్‌లో ప్రాక్టీసు చేశారు. 2009లో జడ్జిగా నియమితులై అనేక ప్రాంతాల్లో అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జి హోదాలో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ 2021లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆమె సీఎల్‌ఎన్ గాంధీని వివాహం చేసుకున్నారు.


