కల్లోలిత ప్రాంతంగా మారిన దండకారణ్యం
అక్కడికి వెళ్లి వచ్చేవారిపై నిరంతర నిఘా
ప్రతీ కదలికను గమనిస్తున్న ఇరుపక్షాలు
దండకారణ్యం నుంచి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కల్లోలిత ప్రాంతమైన దండకారణ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను బయటి ప్రపంచానికి చెప్పేందుకు జర్నలిస్టులు ఒంటరిగా వెళ్లే పరిస్థితులు లేవు. ముఖ్యంగా తెలుగు మీడియా జర్నలిస్టులైతే జట్టుగా వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. హిడ్మా మరణం తర్వాత సర్వత్రా ఆసక్తి నెలకొన్నందున.. అక్కడి అంశాలను బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు తెలుగు జర్నలిస్టుల బృందం ఇటీవల వెళ్లింది.
తెలంగాణ సరిహద్దు నుంచి పువ్వర్తికి వెళ్లాలంటే కనీసం 11 సీఆర్‌పీఎఫ్ క్యాంపులను దాటాల్సిందే. ఈక్రమాన మీడియా బృందం ఓ క్యాంపు దాటుతుండగా సాయుధ జవాన్లు ఆపేశారు. పేరు, సంస్థ, ఫోన్ నంబర్, ఇన్‌టైం వివరాలతో పాటు ఫొటోలు తీసుకుని పంపించారు. మీడియా బృందం పువ్వర్తికి చేరుకునేసరికి తెలుగు మాట్లాడే ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ అక్కడికి వచ్చాడు.
‘ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. మీకేమైనా ఇబ్బందులు వస్తాయి. అందుకే మీ బాగోగులు చూడటానికి వచ్చాను’ అంటూ తనను పరిచయం చేసుకున్నాడు. అక్కడ మీడియా బాధ్యులు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నారనే విషయాలను సదరు జవాన్ ఎప్పటికప్పుడు తన ఫోన్‌లో బంధించాడు.
అన్నల అడవిలో..
హిడ్మా తల్లి పువ్వర్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరాన ఓయ్‌పారా అనే గ్రామంలో ఉందని తెలియడంతో.. మీడియా బృందం అక్కడికి పయనమైంది. గ్రామం నుంచి కొద్ది దూరం వెళ్లాక వాగు ఎదురై.. అక్కడితో ఇటీవల సర్కార్ వేసిన రోడ్డు ముగిసింది. జర్నలిస్టులు వాగు దాటుకుని ముందుకు వెళ్తుంటే, జవాన్ అక్కడే ఆగిపోయాడు.
‘ఇక్కడి నుంచి నేను ముందుకు రాలేను. మీరు వెళ్లి ఇంటర్వ్యూ తీసుకుని త్వరగా వచ్చేయండి’ అని చెప్పాడు. జర్నలిస్టుల బృందం ఓయ్‌పారాకు చేరేసరికి సీఆర్‌పీఎఫ్ జవాన్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి ఫోన్ చేస్తే ‘మిమ్నల్ని ఫాలో అవుతూ అడవిలోకి వచ్చాను, కానీ ఇక్కడ కాలి బాటలు పాయలుగా విడిపోయి ఉన్నాయి, ఏ దారిలో ముందుకు రావాలి’ అని అడిగాడు.
ముప్పిరిగొన్న సందేహాలు
జర్నలిస్టుల బాగోగులు కోసమని వచ్చిన జవాన్.. అన్నల అడవిలో’ తప్పిపోతే పరిస్థితి ఏంటనే సందేహాలు రావడంతో అందరూ వెనక్కి వెళ్లారు. ఏడు నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన కనిపించగా అప్పటికే మరో ఆరు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అతడిని ఓయ్‌పారాకు తీసుకొచ్చేసరికి హిడ్మా తల్లి పొలం పనుల కోసం వెళ్లినట్టు తెలిసింది.
హిడ్మా తల్లి ఉంటున్న ఇంటి ఫొటోలను ఆ జవాన్ తీసుకున్నాడు. ‘ఆలస్యం అయ్యేలా ఉంది. నేను ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. త్వరగా వచ్చేయండి’ అంటూ వెళ్లిపోయాడు. ఆయన క్షేమంగా వెళ్లాడా, లేదా అని ఫోన్ చేయాలని భావించినా.. ఆయన కదలికలను బయటపెట్టినట్లవుతుందనే భావనతో జర్నలిస్టులంతా వెనక్కి తగ్గారు.
డ్రోన్ నిఘా..
హిడ్మా తల్లి కోసం నిరీక్షిస్తుండగా జుమ్... అంటూ శబ్దం వినిపించింది. జర్నలిస్టుల బృందం ఉన్న పాకపై డ్రోన్ ఎగురుతోందని అర్థమైంది. కొద్ది సేపటి తర్వాత శబ్దం ఆగిపోయింది. అంతకు ముందు మాట్లాడిన జవాన్ మాటల ఆధారంగా.. ‘ఆ రోజు లంచ్ కోసం జర్నలిస్టులు ఏ గ్రామంలో వాకబు చేశారు, ఎలాంటి వార్తలు, ఏ తరహాలో అందిస్తున్నారు’ అనే విషయాలపై వారికి పక్కా సమాచారం ఉందనేది అర్థమైంది.
అంతేకాదు దండకారణ్యంలోకి వచ్చి వెళ్లే తెలుగు వాళ్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రతీ సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే జవాన్లు ఉంటారని తెలిసొచ్చింది. ఓ వైపు ప్రభుత్వ పారా మిలిటరీ నిఘా ఇలా ఉంటే.. మరోవైపు అసలు ఆనవాళ్లే గుర్తించలేనంతగా మావో మద్దతుదారులు జర్నలిస్టు బృందంపై కన్నేసి ఉంచారు. ఆ నిఘా నీడలో సంచరిస్తూ హిడ్మా తల్లిని కలిసిన బృందం ఆమె బాగోగులు తెలుసుకుంది.


