సర్పంచ్ ఎన్నికల్లోపట్టు సాధించిన మంత్రులు
75 శాతానికి పైగా గెలిపించుకున్న రేవంత్ ఉత్తమ్, సీతక్క
48 శాతం స్థానాలకే వివేక్ పరిమితం... 60 శాతం దాటని పొన్నం, శ్రీహరి, జూపల్లి
కొల్లాపూర్, హుస్నాబాద్‌లలో బీఆర్‌ఎస్ గట్టిపోటీ..
శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్‌లో అత్యధికంగా బీజేపీకి 19 సర్పంచ్ స్థానాలు
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు చోట్ల ఖాతా తెరవలేకపోయిన కమలనాథులు
చెన్నూరులో ఏకంగా 35 మంది ఇండిపెండెంట్ల గెలుపు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు తమ పట్టు నిలుపుకున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీస్థాయిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారని మూడు విడతల్లో వెల్లడైన ఫలితాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో ఎక్కువమంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్), సీతక్క (ములుగు) ఉన్నారు. ఈ ముగ్గురి నియోజకవర్గాల్లో 75 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందడం విశేషం.
» కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ), శ్రీధర్‌బాబు (మంథని), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం) నియోజకవర్గాల్లో కూడా 70 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు.
» 60 శాతం కంటే ఎక్కువ అధికార పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో మధిర, అందోల్, పాలేరు ఉన్నాయి.
» మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌లో కూడా దాదాపు 60 శాతం స్థానాల్లో హస్తం పార్టీ సహకారంతోనే సర్పంచ్‌లుగా గెలిచారు. వాకిటి శ్రీహరి (మక్తల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)లలో 50–60 శాతం మధ్యలో విజయం దక్కించుకోగలిగారు.
» అత్యల్పంగా వివేక్ వెంకటస్వామి (చెన్నూరు) నియోజకవర్గంలో 50 శాతం కంటే కొంచెం తక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.
సగం చోట్ల బీజేపీ సున్నా..
రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. హుజూర్‌నగర్, ములుగు, మధిర, పాలేరు, ఖమ్మం, చెన్నూరు స్థానాల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోలేకపోయారు.
» మంత్రుల నియోజకవర్గాల్లో కొల్లాపూర్, హుస్నాబాద్‌లలో మాత్రమే బీఆర్‌ఎస్ నుంచి పోటీ ఎదురైందని ఫలితాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
» కొడంగల్‌లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
» స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీలు కలిపి మంత్రుల నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలగడం విశేషం. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఏకంగా 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా గెలిచింది స్వతంత్రులే. బీఆర్‌ఎస్ బలపర్చిన వారు స్వతంత్రు లతో పోలిస్తే సగం స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. స్వతంత్రులు ప్ర భావం చూపిన నియోజకవర్గాల్లో మధిర, కొల్లాపూర్, పాలేరు, మంథని, హుస్నాబాద్‌లు కూడా ఉండడం గమనార్హం.


