పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామపంచాయతీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి సరిహద్దున ఉన్న ఘాట్‌రోడ్డు మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 25 జెడ్ 0067) గురువారం ఉదయం ఆదిలాబాద్ నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరందోలికి వెళ్లింది.
తిరిగి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఘాట్‌రోడ్డుపై బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ సంతోష్ అప్రమత్తతతో బస్సు ఘాట్ పైనుంచి లోయలోకి పడిపోకుండా పొదల్లోకి మళ్లించాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. సంజీవ్ (ఉమ్రీ), రమాదేవి, నాందేవ్ (మహారాజ్‌గూడ)లకు గాయాలయ్యాయి. వారికి గాదిగూడ మండలం ఝరి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్‌కు మార్చారు. నార్నూర్ సీఐ అంజమ్మ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టారు.
హ్యాండ్ బ్రేక్ కూడా ఫెయిలైంది..
పరందోలి గ్రామం నుంచి ఉదయం 9:30 గంటలకు 30 మందితో బయలుదేరామని డ్రైవర్ సంతోష్ తెలిపాడు. ఘాట్‌పైకి రాగానే ఆకస్మికంగా బ్రేకులు పనిచేయలేదని పేర్కొన్నాడు. దీంతో బస్సు కుడివైపు లోయలోకి పడేదని, వెంటనే అప్రమత్తమై ఎడమవైపు తిప్పి పొదల్లోకి తీసుకెళ్లానని పేర్కొన్నాడు. పత్తి చేలలో బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సు హ్యాండ్ బ్రేక్‌కూడా పనిచేయలేదని డ్రైవర్ తెలిపాడు.


