కేసీఆర్‌ను సీఎం చేసే వరకు విశ్రమించొద్దు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు భువనగిరి నుంచే పునాది
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం
నూతన సర్పంచ్‌ల అభినందన సభలో కేటీఆర్
సాక్షి, యాదాద్రి: వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, అధినేత కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని, భవిష్యత్‌లో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పునాది వేసిందన్నారు. గురువారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్.. వారిని సన్మానించిన అనంతరం మాట్లాడారు.
పెద్దలు చెప్పినట్టు ఎక్కడైతే పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్న నానుడిని నిజం చేస్తూ ఈరోజు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడినా.. నేడు భువనగిరి జిల్లా వ్యాప్తంగా 161 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్నామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సాధించిన విజయాలు.. పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్ వికృత రాజకీయం
కాంగ్రెస్ పార్టీ వికృత రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్లగొండలో అభ్యర్థిపై దాడిచేసి అమానవీయంగా మూత్రం తాగించడం వంటి ఘటనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగంతో రీకౌంటింగ్ పేరిట మన గెలుపును దొంగిలించిన 150 గ్రామాల్లో కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పారు.
మూడు ఫీట్లు ఉన్నా.. 30 ఫీట్ల డైలాగులు
సీఎం రేవంత్‌రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా.. ముప్పై ఫీట్ల డైలాగులు కొడతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి మోసపోయామని క్షేత్రస్థాయిలో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని లంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలది సిగ్గులేని రాజకీయం
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని సిగ్గులేని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పోచారం, కడియం వంటివారు 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్‌రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని చెప్పారు. స్పీకర్ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్టు నటిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.
భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.


