సామాజిక పెన్షనర్లలో ఎంతమంది బతికి ఉన్నారో లెక్క తేల్చనున్న సర్కారు
లక్షలాది మంది చనిపోయినా ఇంకా పెన్షన్లు వెళ్తున్న వైనం
ప్రతి పింఛనుదారుడి ఫేషియల్ రికగ్నైజేషన్ ప్రక్రియ చేపట్టే యోచన
నిజమైన లబి్ధదారులను తేలిస్తేనే పథకం విస్తరణకు చాన్స్ ఉంటుందన్న సీఎం
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ‘ఆధార్ డేటా’పైనా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక పింఛన్లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్షలాది మంది పెన్షన్‌దారులు మరణించినా వారి పేరిట ఇంకా పింఛన్లు వెళుతున్న నేపథ్యంలో..పెన్షనర్లలో వాస్తవంగా ఎంతమంది బతికి ఉన్నారనే కచి్చతమైన లెక్క తేల్చడానికి ఫోరె న్సిక్ ఆడిట్ నిర్వహించనున్నారు.
ఇందుకోసం ప్రతి పెన్షన్ లబ్ధిదారుడి ఫేషియల్ రికగ్నైజేషన్ (ముఖ గుర్తింపు) ప్రక్రియ చేపట్టనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించాలన్న నిర్ణయం అమలుకు ఇది కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో పలు అంశాలపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
నిజమైన లబ్ధిదారులను తేలుస్తాం..
‘పెన్షనర్లు మరణించినా సరే వారి పేరుతో ఎవరు లబ్ధి పొందుతున్నారో తేలుస్తాం. నిజమైన లబి్ధదారులను కచ్చితంగా తేలిస్తేనే.. పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి, మరింత మందికి విస్తరింప జేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
మరోవైపు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులకు సంబంధించి అందరూ ఆధార్ కార్డు తప్పనిసరిగా జత చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో..లేని ఉద్యోగాలకు కొందరు తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఇలా తప్పుడు ఆధార్ కార్డుల ఆధారంగా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్టు చూపిస్తున్నారా? ప్రభుత్వం నుంచి ప్రతినెలా వారి బ్యాంకు ఖాతాలోకి వేతనం వెళ్తోందా? లేదా..అసలు ఉద్యోగులే లేకుండా వేతనాలు తీసుకుంటున్నారా? అనే అంశాలకు సంబంధించిన ఐదేళ్ల డేటాపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి.. ఆ విధంగా వేతనాలు తీసుకున్న వారి నుంచి రికవరీ యాక్టు కింద వసూలు చేస్తాం. అలా చెల్లించలేని వారు జైలుకు వెళ్లక తప్పదు. 10 మంది పని చేయాల్సిన చోట ఐదుగురితోనే పనులు కానిచ్చి 10 మందికి చెందిన వేతనాలు తీసుకుంటున్నారు.
ఇలా ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం వల్ల వాస్తవాలు బయటకు వస్తాయి. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు తేలితే వారిపై కూడా చర్యలు తప్పవు..’అని సీఎం హెచ్చరించారు.
నైట్ సఫారీకి గ్లోబల్ బిడ్డింగ్
‘ఫ్యూచర్ సిటీలోని 30 వేల ఎకరాల్లో 14 వేల ఎకరాలు దాదాపు అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది. ఇందులోనే దాదాపు 3 వేల ఎకరాల్లో నైట్ సఫారీని ఏర్పాటు చేయనున్నాం. అటవీ, పర్యాటక శాఖలు దీనిని అభివృద్ధి చేయడానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తాయి. అన్ని రకాల వన్య ప్రాణులను తీసుకొచ్చి ఈ నైట్ సఫారీ ఏర్పాటు చేస్తారు. వంతారా సంస్థ కూడా ఆసక్తి కనపర్చింది.
అయితే గ్లోబల్ బిడ్డింగ్‌ల ద్వారా వచ్చే సంస్థకు ఆ బాధ్యతను అప్పగిస్తాం. వారు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు దానిని నిర్వహిస్తూ.. సందర్శకుల నుంచి టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేస్తారు. వంతారా పాల్గొంటుందా లేదా? చూడాలి. అయితే ఈ భూమిని ఎవరికో నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం కుదరదు. అలా చేస్తే జైలుకు వెళ్లాల్సిందే..’అని రేవంత్ వ్యాఖ్యానించారు.
స్టేడియంలు, గేమింగ్, ఫిలిం సిటీలు
‘నైట్ సఫారీ చుట్టుపక్కల స్టేడియంలు, గేమింగ్ సిటీ, ఫిలిం సిటీ, ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లు, జీనోమ్ వ్యాలీ తరహాలోనే ఆరెంజ్ ఫార్మాసూటికల్స్ వంటివి ఏర్పాటు అ వుతాయి. జపాన్ ఇండ్రస్టియల్ క్లస్టర్‌ను తయారు చేస్తామని మర్బోనీ సంస్థ ముందుకు వచి్చంది. మొత్తం ఫ్యూచర్ సిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి సింగపూర్ సంస్థ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. అందుకు అనుగుణంగా గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా వచ్చే సంస్థలకు వాటిని కేటాయిస్తాం.
మెస్సీ మ్యాచ్‌కు రూపాయి కూడా ఇవ్వలేదు..
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయలేదు. వారు స్పాన్సర్లను పెట్టుకుని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేసుకున్నారు. నేను ఆహ్వానితుడిగానే అక్కడకు వెళ్లా. (సింగరేణి సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది కదా అంటే..) సింగరేణి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద స్పాన్సర్ చేసింది.
అందుకే దాని క్రీడాకారులు సింగరేణి ఎంబ్లమ్ ఉన్న జెర్సీలు ధరించారు. మెస్సీ గ్రూపును అపర్ణా సంస్థ స్పాన్సర్ చేయడం వల్ల వారు వాళ్ల జెర్సీలు ధరించారు. నా మనవడిని క్రీడాకారునిగా చేయాలనే అక్కడకు తీసుకెళ్లా. కేసీఆర్ మనవడి మాదిరిగా పబ్‌లకు పంపలేదు..’అని సీఎం అన్నారు.
విమానాశ్రయం కేంద్రంగానే అభివృద్ధి
‘భవిష్యత్తు అభివృద్ధి అంతా విమానాశ్రయం కేంద్రంగానే జరుగుతుంది. ఆ ప్రాంతంలోనే భూమి అందుబాటులో ఉన్నందున అటువైపు వేగంగా అభివృద్ధి సా ధ్యమవుతుంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పనులు ప్రారంభమయ్యాయి. రహదారుల నిర్మాణం జరుగుతోంది. రెండుమూడు సంవత్సరాల్లోనే రూపురేఖలు మారిపోతాయి. హిల్ట్ పి విధానానికి సంబంధించిన లీక్‌లపై ఇంకా నివేదిక రాలేదు..’అని రేవంత్ తెలిపారు.
కేటీఆర్ హయాంలో ఒక్క ఎన్నికలోనూ గెలవలేదు..
‘కేటీఆర్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ బీఆర్‌ఎస్ గెలవలేదు. కేటీఆర్ హయాంలో విజయాలు లేవంటూ ఆయన్ను తప్పించాలని హరీశ్‌రావు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది వాస్తవం కాదా? కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు హరీశ్‌రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారు.
బీఆర్‌ఎస్ నాయకత్వం కోసం పోటీ జరుగుతోంది. (కవిత కూడా సీఎం అవుతానని అంటున్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ..) మధుకోడా కూడా సీఎం అయ్యారు.. ఎవరైనా సీఎం కావొచ్చు..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్ రేసు కేసులో ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారమే నడుచుకుంటుందన్నారు. అరవింద్ కుమార్ విచారణకు డీవోపీటీ అనుమతి కోసం ఇప్పటికే రెండుసార్లు లేఖ రాశామని తెలిపారు.


