9నెలలకే భార్యను హత్య చేసిన భర్త
కట్నం తేవాలంటూ వేధింపులు
కర్రతో విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రగాయాలు
దెబ్బలు తాళలేక ప్రాణం వదిలిన యువతి
వికారాబాద్ జిల్లా తాండూరులో ఘటన
తాండూరు టౌన్: ప్రేమించి పెళ్లిచేసుకున్న ఓ యువకుడు ఏడాది తిరగకుండానే భార్యను హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం కరన్‌కోట గ్రామానికి చెందిన దస్తప్ప, చంద్రమ్మ దంపతుల కూతురు అనూష (20). భర్త మరణానంతరం చంద్రమ్మ తన కుమార్తెతో కలిసి సాయిపూర్‌లో ఉండేవారు. ఇదే కాలనీకి చెందిన పరమేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఒకే సామాజికవర్గానికి చెందిన పరమేశ్, అనూష మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇరుకుటుంబాల అంగీకారం మేరకు ఈ ఏడాది మార్చి 12న వీరి వివాహం చేశారు. వివాహం జరిగిన మూడు నెలలనుంచే పరమేశ్.. కట్నం, బంగారం తేవాలంటూ తరచూ భార్యను వేధించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు సైతం అతనికే వంతపాడటంతో తరచూ అనూషను కొడుతుండేవాడు.
గురువారం కూడా తన కూతురును కొట్టాడని తెలియడంతో కరన్‌కోట్‌లో ఉన్న తల్లి వచ్చి, అనూషను పుట్టింటికి తీసుకెళ్తుండగా మధ్యలో అడ్డుకున్న పరమేశ్ ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కర్రతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అనూష తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో పరమేశ్‌తో పాటు అతని తల్లిదండ్రులు పరారయ్యారు. ఆస్పత్రికి చేరుకున్న మృతురాలి తల్లి, బంధువులు విగతజీవిగా పడి ఉన్న అనూషను చూసి బోరున విలపించారు. చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.


