అంత మాత్రాన అక్రమాలు చేసినట్లేనా?
ఈ ప్రభుత్వమూ ఎంతో మందికి ఇస్తోంది
సర్కారు మారితే వారిపైనా కేసులు పెడతారా?
సిట్‌కు ప్రభాకర్‌రావు ఎదురు ప్రశ్నలు
మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సుప్రీంను కోరనున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ గురువారంతో ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఉన్న సిట్ కార్యాలయంలో లొంగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన్ను ఏసీపీ పి.వెంకటగిరితో పాటు సంయుక్త సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సైతం వివిధ కోణాల్లో ప్రశ్నించారు.
అయితే ఈ విచారణ నేపథ్యంలో ఎలాంటి అదనపు సమాచారం లభించలేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. మరికొన్ని రోజుల పాటు ప్రభాకర్‌రావును కస్టడీలోకి ఇవ్వాలని, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు సమాచారం.
సుదీర్ఘకాలం ఎస్‌ఐబీలోనే విధులు
2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావు ఆపై 2016లో ఎస్‌ఐబీకి డీఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) నియమించింది. హోదా ఏదైనా ఎస్‌ఐబీ చీఫ్‌గా కొనసాగారు. 2023 డిసెంబర్ వరకు ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావును సిట్ అధికారులు ఆయన ఎక్స్‌టెన్షన్ అంశంపై ప్రశ్నించారు.
పరిపాలనా అవసరాలకే ఎక్స్‌టెన్షన్
ఎక్స్‌టెన్షన్ లభించడానికి కారణం ఏమిటని అడిగారు. అక్రమ వ్యవహారాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఇది సాధ్యమైందా? అనే కోణంలో ఆరా తీశారు. దీంతో.. ఏ ప్రభుత్వమైనా ఆయా పోస్టులకు ఉన్న ప్రాధాన్యత, అధికారుల సమర్థత, పరిపాలన అవసరాలకు అనుగుణంగానే ఎక్స్‌టెన్షన్ ఇస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేక విభాగాల్లో పని చేసి, పదవీ విరమణ పొందిన అధికారులకు ఎక్స్‌టెన్షన్ ఇస్తోందని, అంతమాత్రాన వాళ్లంతా అక్రమాలకు పాల్పడుతున్నట్లేనా? అంటూ ఎదురు ప్రశ్నించారు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎక్స్‌టెన్షన్‌పై పోలీసు విభాగంలో ఓఎస్డీలుగా పని చేస్తున్న వారిపైనా కేసులు పెడతారా? అని అడిగారు..
పార్టీలకు విరాళాలు వ్యాపారుల ఇష్టం..
ప్రభాకర్‌రావు టీమ్ టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారన్నది సిట్ ఆరోపణ. వారి ఫోన్లను ట్యాప్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, మాట వినని వ్యాపారుల వాట్సాప్‌లకు ట్యాపింగ్ చేసిన ఆడియోలు పంపి లొంగదీసుకున్నారని పేర్కొంది.
కొందరు నాయకుల ఆదేశాల మేరకు వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఓ పార్టీ కోసం ఎలక్టోరల్ బాండ్స్ ఖరీదు చేయించారని అనుమానించిన సిట్ ఆ కోణంలోనూ సిట్‌ను ప్రశ్నించింది. అయితే ఎలక్టోరల్ బాండ్స్‌తో పాటు పార్టీలకు విరాళాలు ఇవ్వడమనేది ఆయా వ్యాపారులకు సంబంధించిన అంశమని ప్రభాకర్‌రావు సమాధానమిచ్చారని తెలిసింది.


