వేగంగా నిండుకుంటున్నబారైట్ నిల్వలు
నియంత్రణ లేని ఎగుమతులతోపదేళ్లలోపే ఖాళీ
అమెరికాకు బారైట్ ఎగుమతుల్లో 40 శాతం భారత్ నుంచే
ముడిచమురు అన్వేషణలోబారైట్ అత్యంత కీలకం
సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ పాలసీ నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో బారైట్ నిల్వలు వేగంగా ఖాళీ అవుతుండటంతో దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రత ప్రమాదంలో పడుతోందని ‘సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ పాలసీ రీసెర్చ్’ (సి–డెప్.ఇన్) హెచ్చరించింది. దేశీయంగా బారైట్ తవ్వకాలు భారీగా కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోని పది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లో భారత్‌లోనే ప్రస్తుతం అతి తక్కువగా బారైట్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
‘చమురు, గ్యాస్ డ్రిల్లింగ్ సమయంలో చమురు బావుల్లో అధిక పీడనాన్ని నిరోధించేందుకు బారైట్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో అండమాన్, కృష్ణా గోదావరి బేసిన్లలో జరిగే చమురు, గ్యాస్ ఎక్స్‌ప్లొరేషన్‌పై బారైట్ కొరత భారీ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి’ అని నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.
మంగంపేటలో భారీగా బారైట్
భారతదేశ బారైట్ సంపదలో 95 శాతం ఆంధ్రప్రదేశ్‌లోని మంగంపేట గనిలో కేంద్రీకృతమై ఉంది. అక్కడ నిరూపిత నిల్వలు 2015లో 49 మిలియన్ టన్నుల నుంచి 2024లో 23 మిలియన్ టన్నుల కంటే దిగువకు పడిపోయాయి. దశాబ్ద కాలంలోనే బారైట్ నిల్వలు 53 శాతం తగ్గిపోయాయి. భారతదేశ దీర్ఘకాలిక ఇంధన, దేశీయ అవసరాలకు వ్యూహాత్మక నిల్వలపై వ్యూహం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది.
2016లో చైనా తన ఎగుమతులను నియంత్రించిన తర్వాత ప్రపంచానికి భారతదేశమే అతిపెద్ద బారైట్ ఎగుమతిదారుగా మారింది. అమెరికా తన బారైట్ దిగుమతుల్లో సుమారు 44 శాతం భారత్ నుంచే పొందుతోంది. ఎక్కువగా బారైట్ ఉత్పత్తి చేస్తున్న అమెరికా, ఇరాన్, కజకిస్తాన్, టర్కీ కంటే భారత్‌లోనే తక్కువ నిల్వలు ఉన్నాయి. రష్యా, ఇరాన్, అమెరికా వంటి చమురు ఉత్పత్తి చేసే దేశాలు తమ బారైట్ ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. మరో వైపు దశాబ్దాల పాటు నిల్వలుండేలా బారైట్ ఉత్పత్తిని క్రమబదీ్ధకరిస్తున్నాయి.
ఎగుమతులపై నియంత్రణ తప్పనిసరి
అండమాన్, కృష్ణ, గోదావరి, మహానది బేసిన్‌లలో సుమారు 22 బిలియన్ బారెల్స్ చమురు నిల్వల అన్వేషణ సాగాల్సి ఉందని సీ డెప్ అంచనా వేస్తోంది. దీనికోసం సుమారు 600 మిలియన్ టన్నులకు పైగా బారైట్ అవసరమని అంచనా. మంగంపేటలో ప్రస్తుతం మిగిలి ఉన్న బారైట్ నిల్వలు దేశ అవసరాలకు అనుగుణంగా లేవు.
ఈ నేపథ్యంలో బారైట్ ఎగుమతులపై క్రమబద్ధమైన నియంత్రణలు, ఎగుమతి కేటాయింపు విధానాల సవరణ, బారైట్‌ను జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఏసీఎంఎం)లో చేర్చడాన్ని సీ డెప్ సిఫారసు చేస్తుంది. తమ అధ్యయనం ఖనిజ భద్రత, వ్యూహాత్మక నిల్వలు, భవిష్యత్ చమురు, గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్‌కు దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి దోహదం చేస్తుందని సీడెప్ చెబుతోంది.
దీర్ఘకాలిక విధానాలు అవసరం
‘బారైట్ నిల్వల దీర్ఘకాలిక క్షీణతపై ప్రభావం విశ్లేషణ’ అనే అంశంపై ఐఐటీ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ నివేదికను ఎంపీఎండీసీ మాజీ ఎండీ ప్రవీణ్ ప్రకాశ్ విడుదల చేశారు. ‘బారైట్ నిల్వల క్షీణత కేవలం ఖనిజ సమస్య మాత్రమే కాదు, ఇది జాతీయ ఇంధన భద్రత సమస్య. భారతదేశం తన ముడి చమురు డిమాండ్‌లో 90 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. దేశీయ చమురు, గ్యాస్ నిల్వలను ఎక్స్‌ప్లోర్ చేసి తవ్వే సామర్థ్యం అవసరం. భవిష్యత్తులో సురక్షితంగా, సమర్థవంతంగా డ్రిల్ చేయడాన్ని బారైట్ నిర్ణయిస్తుంది.
ఈ వనరును సంరక్షించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎంపీఎండీసీ ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రస్తుతం బారైట్ కీలకంగా ఉంది. బారైట్ ఆదాయంతో ఏపీఎండీసీ రూ.10 వేల కోట్ల బాండ్లను సేకరించింది. దీంతో బారైట్ సంరక్షణ పక్కన పెట్టి నిరంతరం ఆర్థిక అవసరాల కోసం తవ్వాల్సిన పరిస్థితిని సృష్టిస్తోంది’.. అని ఆయన పేర్కొన్నారు. బారైట్ నిల్వల పరిరక్షణకు దీర్ఘకాలిక విధానం అవసరమని సీ డెప్ అధ్యక్షుడు డాక్టర్ జైజిత్ భట్టాచార్య పేర్కొన్నారు.


