మరో మూడు రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో పగటి పూట పొగమంచు
తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలులు
దీంతో చలి పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండ్రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో, కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదు కాగా.. రానున్న మూడు రోజులు మరింత తగ్గుతాయని హెచ్చరించింది. సగటున సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 33.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
గురువారం పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మరింత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా రాష్ట్ర ప్రణాళిక శాఖ ఉష్ణోగ్రతల గణాంకాలు విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.4 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.5 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్‌లో 7.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


