ఉన్నతవిద్యలో భారీ మార్పులు!
ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో మార్పులు.. డిఫెన్స్, ఏరోస్పేస్ కోర్సుల ఏర్పాటు
ఈ నెల 29న జరిగే వీసీల భేటీలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నతవిద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 29వ తేదీన జరిగే విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. సమావేశంలో చర్చించబోయే అంశాలతో కూడిన ఎజెండాను వీసీలకు పంపారు. దీనిపై పూర్తి సమాచారంతో రావాలని ఆయన సూచించారు. డిగ్రీ, పీజీ కోర్సుల ప్రక్షాళనపై కొన్ని నెలలుగా మండలి దృష్టి పెట్టింది. నిపుణులతో కమిటీలు కూడా వేసింది. నిపుణుల నివేదికల ఆధారంగా సిలబస్‌పై తుది నిర్ణయానికి వచ్చారు. అన్ని యూనివర్సిటీల వీసీలతో కలిసి సమావేశంలో అమలుకు సంబంధించిన తీర్మానం చేయనున్నారు.
డిగ్రీ, పీజీ కోర్సులకు సాంకేతికత జోడించేలా....
డిగ్రీ, పీజీ కోర్సులకు సాంకేతికతను జోడించనున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో కంప్యూటర్ సైన్స్, డేటా, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎమర్జింగ్ కోర్సులు అందుబాటులోకి తెస్తారు. ప్రతీ కోర్సులోనూ కనీసం 20 శాతం కంప్యూటర్ ఆధారిత సిలబస్ ఉంటుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. క్లాస్ రూంలో థియరీ బోధనతోపాటు, పరిశ్రమల్లో నైపుణ్యం పెంచేలా కోర్సులను డిజైన్ చేశారు. ఎమర్జింగ్ కోర్సులు అందించే కాలేజీలు విధిగా నైపుణ్యం అందించే పరిశ్రమలతో భాగస్వామ్యం కలిగి ఉండేలా మార్పులు చేయబోతున్నారు.
పవర్ ఫుల్ పీజీ
పోస్టు–గ్రాడ్యుయేషన్ కోర్సులకు కొన్నేళ్లుగా ఆదరణ తగ్గుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పీజీ కోర్సుల ఉన్నతిని పెంచాలని కౌన్సిల్ నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల నుంచి ఆధునిక సాంకేతిక సిలబస్‌ను అందించడం, దీన్ని పీజీ స్థాయిలో ఉన్నతీకరించడం చేస్తారు. పీహెచ్‌డీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయి కల్పించేలా మార్పులు తెస్తున్నారు. బోధన ప్రణాళికను వివిధ అంతర్జాతీయ వర్సిటీలు, విద్యాసంస్థల మేళవింపుతో తీర్చిదిద్దనున్నారు. పీజీ మరింత పవర్ ఫుల్‌గా అందించడం దీని ఉద్దేశమని మండలి వర్గాలు తెలిపాయి. పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఆలస్యాన్ని నివారించే విధానాలపై సమావేశంలో చర్చిస్తారు.
వైమానిక, రక్షణ రంగంలో..
వైమానిక, రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలకు పెరగబోతున్నాయని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఏరోస్పేస్‌లో సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్‌లు, ఏఐ ఆధారిత ఉద్యోగ అవకాశాలకు మంచి భవిష్యత్ ఉండబోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఈ రంగంలో కోర్సులపై దృష్టి పెట్టాలని మండలి భావించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్లలో ఎలాంటి కోర్సులు అందించాలనే దానిపై వీసీల సమావేశంలో చర్చిస్తారు. ఇదే క్రమంలో అంతర్జాతీయంగా కోర్సుల డిజైన్, ఉపాధి అవకాశాలపై అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తారు.
జీరో అడ్మిషన్లు ఉంటే నో పర్మిషన్
త్వరలో అకడమిక్ ఆడిట్ చేపట్టబోతున్నారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపయోగం లేని కోర్సులను ఎత్తివేయాలని భావిస్తున్నారు. కనీసం 25 శాతం విద్యార్థులు లేని సెక్షన్లు, కోర్సులు, కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. దీనిపై వీసీల సమావేశంలో ఒక తీర్మానం చేసే వీలుందని మండలి వర్గాలు తెలిపాయి. వర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీల్లో కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న కోర్సులు, విద్యార్థుల చేరికలపై వివరాలు ఇవ్వాలని మండలి వీసీలను కోరింది.
వచ్చే ఏడాది నుంచే మార్పులు
ఉన్నతవిద్యలో గుణాత్మక మార్పులు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమలులోకి రాబోతున్నాయి. నైపుణ్యం, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు అందుకోగల స్థాయికి పీజీ, డిగ్రీ కోర్సులను తేవడమే దీని లక్ష్యం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్)


