నిజాయితీ, ధైర్యానికి ప్రతీక పోలీస్
● డీజీపీ శివధర్‌రెడ్డి
గచ్చిబౌలి: పోలీసు అధికారులు, వృత్తినైపుణ్యంలో ముందుండటంతోపాటు సేవల్లోనూ మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో 8వ వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలను అందజేశారు. అంతకుముందు పోలీసుజాగిలం డీజీపీకి సెల్యూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పోలీసుశాఖ మంచి ర్యాంకులు సాధిస్తూనే ఉందన్నారు. విధి నిర్వహణ తోపాటు దర్యాప్తులోనూ అదే స్థాయి ప్రతిభ చూపాలన్నారు. క్రీడలతో పాటు ప్రజల మనసులను కూడా గెలుచుకోవాలన్నారు. సైబరాబాద్ పోలీసులు నిజాయితీ, ధైర్యానికి ప్రతిరూపంగా నిలవాలని ఆయన సూచించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్‌మహంతి మాట్లాడుతూ రాష్ట్రంలో సైబరాబాద్ ఒక ప్రత్యేక కమిషనరేట్ అని అత్యధికంగా డయల్–100 కాల్స్ వచ్చే ప్రాంతాల్లో ఇది ముందంజలో ఉందన్నారు. అలాగే వీఐపీలు ఎక్కువగా సందర్శించే ప్రాంతం కూడా ఇదేనని గుర్తు చేశారు. కమిషరేట్ ప్రాంతంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులు ప్రత్యేకంగా, పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు , వెల్ఫేర్ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


